మరింత అంతరం! | - | Sakshi
Sakshi News home page

మరింత అంతరం!

Oct 16 2025 5:49 AM | Updated on Oct 16 2025 5:49 AM

మరింత అంతరం!

మరింత అంతరం!

ఓరుగల్లు కాంగ్రెస్‌లో తారస్థాయికి మంత్రుల మధ్య విభేదాలు

వరుస వేట్లతో కలకలం..

ఓరుగల్లు కాంగ్రెస్‌లో తారస్థాయికి మంత్రుల మధ్య విభేదాలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

అధికార కాంగ్రెస్‌ పార్టీలో అసలేం జరుగుతోంది.. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయా.. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ దంపతుల నడుమ అగాధం పెరిగిపోయిందా.. మేడారం టెండర్లపై ఇటీవల కాలంలో కొండా మురళి హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారన్న ప్రచారం మరింత గ్యాప్‌ను పెంచిందా.. వరంగల్‌ రాజకీయాలపై పార్టీ, ప్రభుత్వం దృష్టి సారించిందా.. అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చెబుతున్నారు. రోజురోజుకూ చినికి చినికి గాలివానగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలపై ఇటు అధిష్టానం.. అటు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వివాదాస్పదంగా వ్యాఖ్యలు..

మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతోంది. రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుల వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యేపై చేసిన బాడిషేమింగ్‌ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఆ తర్వాత తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా దంపతులపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం వరకు వెళ్లారు. వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, కేఆర్‌ నాగరాజు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావులు టీపీసీసీ చీఫ్‌, సీఎంలకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావులతో మాట్లాడింది. టీపీసీసీ చీఫ్‌, సీఎంల జోక్యంతో సద్దుమణిగినట్లే అనిపించినా.. అంతర్గతంగా ఇంకా రగులుతూనే ఉంది. ఇదే సమయంలో మేడారం సమ్మక్క–సారలమ్మల గద్దెల పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కొండా మురళి ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారంపై సంప్రదించిన మీడియా ప్రతినిధులతో ‘నేను ఇంట్లోనే ఉన్నాను.. ఎవరిని కలవలేదు, ఫిర్యాదులు కూడా చేయలేదు’ అని మురళి స్పష్టం చేశారు. ఇవన్ని జరుగుతున్న సమయంలోనే మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌పై ప్రభుత్వం వేటు వేయడం, బుధవారం హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డిని ఆమె కలవకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

అధికారుల మితిమీరినతనంపై చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పరిధిలోని ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వరంగల్‌ ఏసీపీ నందిరాం నాయక్‌ తూర్పులో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాయకుల బర్త్‌డే వేడుకలు జరపడం.. ఏ హోదా లేకున్నా ఎస్కార్టు ఇవ్వడంతోపాటు ఇతర కారణాలను చూపుతూ ఆయనపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నందిరాంనాయక్‌ స్థానంలో ఐపీఎస్‌ అధికారి శుభం ప్రకాశ్‌ నాగర్లేకు ఏసీపీ బాధ్యతలు ఇచ్చారు. తాజాగా మంత్రి సురేఖ పేషీలో ఓఎస్‌డీగా పనిచేసే సుమంత్‌ను అ పదవినుంచి ప్రభుత్వం మంగళవారం తప్పించింది. 2023 డిసెంబర్‌నుంచి ఈ పదవీ బాధ్యతలు చూస్తున్న సుమంత్‌ అభివృద్ధి పనుల్లో మితిమీరిన జోక్యం.. ఇటీవల మేడారం పనుల వివాదానికి కూడా కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం విచారణకు ఆదేశించి.. ఆరోపణలు నిజమేనని తేలడంతో వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కొండా దంపతులు ప్రమేయం లేకుండా జరిగాయన్న ప్రచారం ఉండగా.. బుధవారం సీఎం పర్యటనకు హాజరు కాకపోవడంపైనా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చాలా ఏళ్లుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కొండా దంపతులకున్న రాజకీయ విబేధాలు, వైరం కారణంగానే సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. కాగా ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, కుమ్ములాటలకు చెక్‌ పెట్టే దిశగా పార్టీ, ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదారు రోజుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు నిఘావర్గాలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

వైరల్‌గా మారిన మంత్రి పొంగులేటిపై ఫిర్యాదుల ప్రచారం

వివాదాస్పదంగా కొండా దంపతుల వ్యాఖ్యలు... సీరియస్‌గా తీసుకుంటున్న ప్రభుత్వం

మొన్న ఏసీపీ, నేడు ఓఎస్‌డీ..

వేటు వేయడంపై దుమారం

ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా కొండా దంపతులు

జిల్లా రాజకీయాలపై ఇంటెలిజెన్స్‌ వర్గాల ఆరా...?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement