
రెవెన్యూ శాఖకు జీపీఓలు కీలకం
భూపాలపల్లి: రెవెన్యూ శాఖకు జీపీఓలు కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నూతనంగా నియమితులైన జీపీఓ (గ్రామ పాలన అధికారి) లకు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. రెవెన్యూ విధులు అత్యంత కీలకమన్నారు. గ్రామస్థాయిలో ప్రతీ అంశంపై అవగాహన ఉండటం ప్రధాన బాధ్యతనన్నారు. భూముల సమస్యలు, రైతుల ఇబ్బందులు, ప్రజల అభ్యర్థనలను మొదటగా గుర్తించేది జీపీఓలేనన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 54 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలనలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, జీపీఓలు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు..
వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్రస్థాయిలో అధికారులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. నవంబర్ మొదటివారం నుంచి జిల్లాలో కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. వీసీలో ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ