
42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలన్నారు. బీసీ బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు నిలిచిపోయాయని, దీనికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోసఫ్, లా వణ్య, యాకూబ్, రమేష్, తిరుపతి, కష్ణ, మహేందర్, రజిత, యాకూబీ తదితరులు పాల్గొన్నారు.