
శిక్షకుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఉచిత వృత్తి శిక్షణ కోర్సులను నేర్పించేందుకు శిక్షకుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ (డీటీపీ), మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లిషు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, జూట్ బ్యాగ్‌ల తయారీని నేర్పించాల్సి ఉంటుందన్నారు. ఓసీ ప్రభావిత గ్రామాల మహిళలు టైలరింగ్ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి, అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈ నెల 25వ తేదీలోపు జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో అర్హత ధృవపత్రాలతో కూడిన దరఖాస్తులను అందించాలని సూచించారు.
పలిమెల: పోడు పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మహదేవపూర్ యూని యన్ బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్‌లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ మహదేవపూర్, పలిమల మండలాలకు సంబంధించిన ఆదివాసీ రైతులు అటవీ పట్టా లు పొందినప్పటికీ బ్యాంకుల నుంచి పంట రుణాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రుణాలు ఇస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రమే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దమ్మూరు మాజీ ఉపసర్పంచ్ మడే సత్యనారాయణ, సంఘం నాయకులు పెద్ది శేఖర్, రామినేని రాజబాబు, తోలం భిక్షపతి, మేడే సురేష్, జనగామ ముత్తయ్య పాల్గొన్నారు.
కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తయారు చేసిన సూక్ష్మ కళాకృతులకు గుర్తింపుగా అత్యంత ప్రముఖమైన క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు దక్కింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెన్సిల్ గ్రాఫైట్‌పై 0.4 మిల్లీమీటర్ల ఎత్తు 0.2 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ పతాకాన్ని సుమారు గంట పాటు శ్రమించి రజనీకాంత్ తయారు చేశారు. క్రెడిట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు వికాస్ బొండవే, పునీత్ మాదన్ సూక్ష్మ ఆకృతిని గుర్తించి రజనీకాంత్‌కు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఇంతకుముందు రజనీకాంత్ రెండు బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులతో పాటు అంతర్జాతీయ జాతీయ అవార్డులను కూడా సాధించారు. క్రెడిట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న రజనీకాంత్‌ను ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, వార్డెన్ బలరాం, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
వెంకటాపురం(ఎం): 13వ శతాబ్దంలోనే కాకతీయులు ట్రిపుల్ టీ (టౌన్, టెంపుల్, ట్యాంక్) విధానాన్ని అనుసరించారని ప్రొఫెసర్ పాండురంగారావు వలంటీర్లకు వివరించారు. మండల పరిధిలోని రామప్పలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ సోమవారం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ టీ విధానంపై పలు వివరాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ సత్యనారాయణ రామప్ప ప్రాంత చరిత్ర, ఈ ప్రాంత ప్రజల జీవన విధానం, సాంస్కృతిక వైవిధ్యం గురించి వివరించారు. ప్రొఫెసర్ సీతారాములు స్ట్రెస్ ఎనాలిసిస్ ఆన్ హెరిటేజ్ స్ట్రక్షర్స్ ఎలా చేయాలో వివరించారు. అనంతరం పాండవుల గుట్ట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలో తెలుసుకున్న అంశాలను పవర్ పాయింట్ ద్వారా వలంటీర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కో ఆర్డినేటర్ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.

శిక్షకుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ

శిక్షకుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ