
క్రీడలతో మానసికోల్లాసం
భూపాలపల్లి: క్రీడలతో శారీరక దృఢత్వం పెంపొందడమే కాక మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో అటవీశాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్‌రావు, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు క్రీడలు ఆడటం మూలంగా విధుల పట్ల క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందుతాయని అన్నారు. అనంతరం జోన్ స్థాయి అధికారుల మధ్య వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, చెస్, క్యారం, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించారు. సాయంత్రం పర్యావరణ పరిరక్షణపై నాటకాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాళేశ్వరం జోన్ పరిధిలోని ఐదు జిల్లాల డీఎఫ్‌ఓలు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు..
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 41 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమయానికి చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అధికారులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి..
జిల్లాలో ప్రభుత్వ శాఖల పనితీరు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి శాఖాధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవులలో వెళ్లరాదని సూచించారు. ఏ అధికారి సెలవులో వెళ్లారో, ఫీల్డ్‌కు వెళ్లారో తెలియడం లేదన్నారు. సిబ్బంది హాజరు సక్రమంగా ఉండేలా ప్రతి అధికారి పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ