
ఉద్యోగాల ఎగవేతకు కుట్రలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కారుణ్య నియామకాలు చేపట్టకుండా సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల ఎగవేతకు కుట్రలు పన్నుతుందని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో బొగ్గు గని కార్మికులకు దీపావళి పీఎల్‌ఆర్ బోనస్ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెంచినట్లు చెప్పారు. మెడికల్ బోర్డు ఉద్యోగాల జాప్యం ఎందుకు జరుగుతుందో సింగరేణి యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కులను బొందపెట్టాలని సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోందన్నారు. సింగరేణిలో కార్మికులు అన్‌ఫిట్ అవుతున్నా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు యాజమాన్యం, ప్రభుత్వానికి లొంగుబాటు వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, రాసాకట్ల నర్సింగరావు, శంకర్, నారాయణ, మల్లేష్, రాజు, భాస్కర్ పాల్గొన్నారు.