
సర్వేలతోనే సరి!
పంటలు నష్టపోతున్నా..
అందని పరిహారం
హామీలకే..పరిమితం..
పంటల బీమా అమలు చేయాలి
భూపాలపల్లి రూరల్: జిల్లాలో ప్రతీ ఏటా వేలాది ఎకరాల్లో పంట నీటమునిగి రైతులు నష్టపోతున్నా.. అధికారులు కేవలం సర్వేలతోనే సరిపెడుతున్నారు. నష్టపరిహారం మాత్రం అందడంలేదు. కొన్ని పంటలు ప్రారంభదశలోనే దెబ్బతింటుండగా మరికొన్ని పంటలు కోత సమయంలో అకాల వర్షాలతో రైతుల ఆశలు ఆవిరి చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో 865 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందనలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కాళేశ్వరం బ్యాక్ వాటర్, మోరంచవాగు, మానేరు వాగు పరిసర గ్రామాల్లో ప్రతీ ఏటా పంటలకు నష్టం జరుగుతూనే ఉంది.
పరిహారం గాలిలో దీపం..
పంట నష్టం సంభవించిన ప్రతీసారి వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి, నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నారు. గతేడాది కూడా ఇలాంటి నివేదికలు సమర్పించినప్పటికీ, రైతులకు ఎటువంటి పరిహారం అందలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం రైతులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. పంట నష్టం జరిగిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సి ఉన్నప్పటికీ, అది గాలిలో దీపంలా మిగిలిపోయింది.
ఫసల్ బీమా పథకం అమలు కాక
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, అతివృష్టి, అనావృష్టి వంటి సమయాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందేవారు. పత్తికి వాతావరణ ఆధారిత బీమా, వరి, సోయా వంటి పంటలకు గ్రామ యూనిట్ ఆధారంగా, ఇతర పంటలకు మండల యూనిట్ ఆధారంగా పరిహారం అందించేవారు. బీమా ప్రీమియంలో రైతులు 50శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25శాతం చొప్పున భరించేవి. అయితే, 2018–19 నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేయడంతో రైతుల పంటలకు రక్షణలేకుండా పోయింది.
కేవలం సర్వేలు చేసి
నివేదికలు పంపుతున్న అధికారులు
ఫసల్‌బీమా లేక నష్టపోతున్న రైతులు
రాష్ట్ర ప్రభుత్వ హామీ మీదే ఆశలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం అమలులో ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు మేలు జరిగేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరంచవాగు ఉధృతికి వాగు పరిసర గ్రామాల్లో పొలాలు, పత్తి చేను వరదకుగురయ్యాయి. పొలాల్లో ఇసుక మేటలు పెట్టాయి. పంటల బీమా లేదు. ప్రభుత్వం ఆదుకుంటామని ప్రకటించినా.. ఇప్పటి వరకు ఎంత సాయం ఇస్తదో స్పష్టత లేదు. ఫసల్‌బీమా అయిన ప్రభుత్వం అమలు చేస్తే రైతులకు ఉపయోగపడుతోంది.
– బొమ్మ వెంకటేశ్, కొత్తపల్లి (ఎస్‌ఎం) భూపాలపల్లి

సర్వేలతోనే సరి!

సర్వేలతోనే సరి!