
ఇక.. భూసేకరణ వేగవంతం
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో పరిహారం విషయమై ఇప్పటికే డిస్టిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ చర్చించింది. వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887గా నిర్ణయించింది. పాత ఎయిర్ స్ట్రిప్‌నకు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్‌వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లు కేటాయించింది. అందుకు పరిపాలన అనుమతుల మంజూరు శుక్రవారం ఇవ్వడంతో ఇక భూసేకరణ వేగవంతం కానుంది. కాగా, 50 శాతంమందికి పైగా రైతులు తమ కన్సెంట్ (అంగీకార పత్రం) తెలపడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండానే భూసేకరణ జరుగుతుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రూ.205 కోట్లు కేటాయించిన జీఓ ఆధారంగా ఇప్పుడు బడ్జెట్ కేటాయించారంటున్నారు.
మూడు జిల్లాలను అనుసంధానించేలా...
కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్‌లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూసేకరణ అవసరం. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ దిగి మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు ఆటంకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వరంగల్‌లోనే నేరుగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని భావించింది. అలాగే, ఉత్తర తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన కరీంనగర్‌తోపాటు ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు మామునూరు విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించేలా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్–కరీంనగర్ మధ్య 80 కిమీ మేర ఎన్‌హెచ్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. వరంగల్ –ఖమ్మం నేషనల్ హైవే ప్రస్తుత రద్దీకి అనుగుణంగా లేదు. నల్లగొండ జిల్లా ప్రజలను ఓరుగల్లుతో అనుసంధానించేందుకు వరంగల్–దంతాలపల్లి–సూర్యాపేట వరకు రెండు వరుసల ఎన్‌హెచ్ ఉంది. దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అలాగే, వరంగల్ నుంచి 15 కిమీ దూరంలో ఉన్న మామునూరుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట నుంచి రేడియల్ రోడ్లు నిర్మించాలి. నగర ఇన్నర్, ఔటర్ రింగురోడ్లను ఎయిర్‌పోర్టుతో అనుసంధానిస్తారు.
పర్యాటకం, ఐటీ పరిశ్రమలకు బూస్ట్..
● మామునూరు ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైతే కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ మాదిరిగానే భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి భక్తులు, సందర్శకులు పెరుగుతారు.
● టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్ట్ కీలకంగా మారనుంది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని కై టెక్స్ మాదిరిగానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపారసంస్థలు ముందుకు వస్తాయి. దీంతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది.
● మామునూరు సమీప ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది.
మరో రూ.112 కోట్లు అవసరమే..
విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 240 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు 13 ఎకరాల (61,134.5 చదరపు గజాల) వ్యవసాయేతర భూమి సేకరించాల్సి ఉంది. వ్యవసాయ భూమికి రూ.288 కోట్లు్, వ్యవసాయేతర భూమికి రూ.29,87,61,858 భూనిర్వాసితులకు చెల్లించాలి. మొత్తంగా రూ.317 కోట్లు అవసరం అవుతుండగా.. మరోదఫా ప్రభుత్వం రూ.112 కోట్లు అవసరం. భూసేకరణ పూర్తయి, ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైతే 150 నుంచి 186 మంది ప్రయాణించే ఏ–320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.
మామూనూరు విమానాశ్రయంపై సర్కారు నజర్
తాజాగా 253 ఎకరాల కోసం రూ.205 కోట్లకు పాలనాపరమైన
అనుమతులు
విమానాశ్రయానికి 50 శాతం
మందికిపైగా రైతులు అంగీకారం
మరో రూ.112 కోట్లు అత్యవసరం