
మరో పోరాటం తప్పదు
భూపాలపల్లి రూరల్: పింఛన్లు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించి మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. పింఛన్ల పెంపు కోసం మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం జిల్లాకేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6 వేలు, ఆసరా పెన్షన్‌దారులకు రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు అందించాలన్నారు. పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన రూ.20 వేల కోట్లు ఎవరికి దోచిపెట్టారని ప్రశ్నించారు. పింఛన్లు పెంచడం చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పింఛన్ల పెంపు సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దుమ్ము వెంకటేశ్వర్లు, ఎంఎస్‌పీ సీనియర్ నాయకులు రుద్రారపు రామచంద్ర, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ అనుబంధ సంఘాల నాయకులు నోముల శ్రీనివాస్, దోర్ణాల రాజేందర్, గాజుల భిక్షపతి, బొల్లి బాబు, అంతదుపుల సురేష్ పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు
మందకృష్ణ మాదిగ