
సర్కారు బడుల్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్స్
ఉమ్మడి జిల్లాలో 10 పాఠశాలలు ఎంపిక
ఏఆర్, వీఆర్ ల్యాబ్‌లకు సంబంధించి మోడల్ చిత్రాలు
జనగామ : ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలు చేస్తూ ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారుస్తోంది. ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, కనీస వసతి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం.. కొత్తగా ఏఆర్(అగ్మెంటెడ్ రియాల్టీ), వీఆర్(వర్చువల్ రియాల్టీ) ల్యాబోరేటరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో మొదటి విడత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 పీఎం శ్రీ పాఠశాలలను ఎంపిక చేశారు.
బోధన.. ప్రయోజనాలిలా..
● ఏఆర్, వీఆర్ ల్యాబ్‌లతో ఆస్ట్రోనమీ (ఖగోళ శాస్త్రం), రెండవ ప్రపంచ యుద్ధం, గుండె పనితీరు, మానవ శరీరంలోని అవయవాల కదలికలు, నాటి చరిత్రలు (హిస్టరీ) తదితర సబ్జెక్టుల వారీగా బోధన చేసే సమయంలో విద్యార్థులు ప్రత్యక్ష అనుభూతికి లోనవుతారు.
● దిగువ స్థాయి పిల్లవాడినుంచి బాగా చదువుకునే విద్యార్థి వరకు ఏఆర్, వీఆర్ బోధన పరికరాలతో టీచర్ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు.
● విద్యార్థులు గుండె, కణాల నిర్మాణం వాటి విధులు, జీవశాస్త్ర, ఆస్ట్రానమీ లాంటి ఫిజిక్స్, గణిత, గతంలోకి వెళ్లి హిస్టరీ పాఠాలను ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ టెక్నాలజీలను ఉపయోగించి వీఆర్ ద్వారా వాటిలోకి ప్రవేశించి స్వీయ అనుభవంతో నేర్చుకుంటారు.
● పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రతీ పాఠశాలకు 10 ఏఆర్, వీఆర్ పరికరాలు, ఒక బీన్ బ్యాగ్, ఒక చార్జింగ్ ట్రాలీ, ఒక టాబ్, ఒక టీచర్ సపోర్టింగ్ ట్యాబ్, ఒక స్టోరేజ్ కేస్, 1 కేవీఏ యూపీఎస్ పరికరాలను ల్యాబ్‌లో అమర్చనున్నారు.
● 5 నుంచి 10 తరగతి వరకు జనరల్ సైన్స్, గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాన్ని బోధించడానికి, విద్యార్థులు నేర్చుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తారు.
5డీ మోడ్‌లో....
వీఆర్ హెడ్‌గేర్ రాష్ట్ర పాఠ్యాంశాలకు మ్యాప్ చేసిన కంటెంట్‌తో లోడ్ చేశారు. దీని ద్వారా విద్యార్థులు ఇంటరాక్టివ్ , 5డీ(ప్రస్తుత టెక్నాలజీ) మోడ్‌లో పాఠాలను నేర్చుకోగలుగుతారు. గుండె పనితీరును బోధించే సమయంలో ఉపాధ్యాయులు బోర్డుపై హృదయ రేఖాచిత్రాన్ని గీసి చూపించాలి. వీఆర్ ఆధారిత అభ్యాసం విషయంలో హెడ్‌గేర్‌ను ఉపయోగించడంతో త్రీడీలో హృదయం తెరపై కనిపిస్తుంది. మనిషి ఆర్గాన్ పనితీరును విద్యార్థులు చూడడంతోపాటు సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
పీఎం శ్రీ ఎంపిక చేసిన
పాఠశాలల్లోనే..
ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన స్కూల్స్‌లో ఏఆర్, వీఆర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. పరికరాలు సైతం వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్ జారీ చేశారు. మెటీరియల్ వినియోగం, నిర్వహణ కోసం పాఠశాలలోని ఫిజికల్ లేదా బయాలజీ టీచర్‌ను నియమిస్తారు. ఏజెన్సీ ద్వారా ఏఆర్, వీఆర్ ల్యాబ్‌ల పరికరాలు వచ్చిన వెంటనే హెచ్‌ఎంలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
– బొమ్మన బోయిన శ్రీనివాస్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, జనగామ
ఉమ్మడి జిల్లాలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలు..
జిల్లా మండలం ఉన్నత పాఠశాల
భూపాలపల్లి భూపాలపల్లి గొల్లబుద్దారం
హనుమకొండ ఐనవోలు ఒంటిమామిడిపల్లి
హనుమకొండ కాజీపేట మడికొండ
జనగామ అర్బన్ ధర్మకంచ
మహబూబాబాద్ మహబూబాబాద్ బాలికల
మహబూబాబాద్ తొర్రూరు తొర్రూరు
మహబూబాబాద్ గూడూరు పొనుగోడు
మహబూబాబాద్ దంతాలపల్లి దంతాలపల్లి
వరంగల్ నర్సంపేట నర్సంపేట, బాలికల
వరంగల్ రాయపర్తి కొండూరు
ప్రతీ సబ్జెక్టుతో అనుసంధానం
విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి

సర్కారు బడుల్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్స్