
పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు
కాటారం: ప్రతాపగిరి సమీపంలోని ఆధ్యాత్మిక, చారిత్రాత్మక చరిత్ర కలిగిన గొంతెమ్మగుట్టను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి తెలిపారు. మహదేవపూర్ ఎఫ్‌డీఓ సందీప్‌రెడ్డి, అటవీశాఖ సిబ్బందితో కలిసి శుక్రవారం గొంతెమ్మ గుట్టను ఆయన పరిశీలించారు. గుట్టపై ప్రాంతాన్ని, ఆధ్యాత్మిక, చారిత్రాత్మిక ఆనవాళ్లపై ఆరాతీశారు. శ్రావణమాసంలో గుట్టపైకి భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పాటు జనవరిలో నిర్వహించే గొంతెమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. గుట్టపైకి ట్రెక్కింగ్ ఏర్పాటు, గుట్టపై సోలార్ విద్యుత్, సోలార్ తాగునీటి బోరు, కమాన్ ఏర్పాటు, గ్రామం నుంచి గుట్టపైకి భక్తులు వెళ్లడం కోసం మట్టి రోడ్డు నిర్మాణం, కల్వర్టుల పునఃనిర్మాణం, చేపట్టాల్సిన ఇతరత్రా అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మరింత కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎఫ్‌ఓ వెంట కాటారం ఎఫ్‌ఆర్‌ఓ స్వాతి, డిప్యూటీ రేంజర్‌లు సురేందర్‌నాయక్, శ్రీనివాస్, ఎఫ్‌ఎస్‌ఓ చంద్రశేఖర్, ఎఫ్‌బీఓలు సంజీవ్, మోయినోద్దిన్, అశోక్, అర్చన, సిబ్బంది ఉన్నారు.
జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి