
వంతెన కోసం నిరీక్షణ
పలుగుల వద్ద వంతెన నిర్మాణం చేసే ప్రాంతం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజల చిరకాల వాంఛ పలుగుల–చెన్నూర్ మధ్యలో వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తే రెండు జిల్లాల వాసులకు ప్రయాణ దూర భారం తగ్గడమే కాకుండా అభివృద్ధికి బాటలు పడుతాయని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం మట్టి పరీక్షలు నిర్వహించిన సమయంలో ఆనందాలు వెల్లువిరిశాయి, కానీ ఏడేళ్లు గడిచినా ఆ వంతెనపై ప్రజాప్రతినిధులు ఊసెత్తడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంథని, చెన్నూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గనులు, కార్మికశాఖ మంత్రిగా గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉండడంతో వంతెన నిర్మాణంపై రెండు జిల్లాల ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు.
మట్టిపరీక్షలు చేసి ఆశలు నింపి..
మహదేవపూర్ మండలం పలుగుల వద్ద గోదావరిపైన 1.2 కిలోమీటర్ల పొడవుతో 40 పిల్లర్లతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ గ్రామ గోదావరి ఒడ్డు వరకు వంతెన నిర్మాణానికి 2017 ఏప్రిల్‌లో రెండు వారాల పాటు యంత్రాలతో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించారు. గోదావరిలో మొత్తం ఏడు చోట్ల మట్టి నమూనా పరీక్షలు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఐబీఎస్ సంస్థ ఆధ్వర్యంలో 40 మీటర్ల లోతు వరకు మట్టి పరీక్షించారు. మరో చోట కుంట్లం, ఎర్రాయిపేట మీదుగా కూడా నిర్మాణం చేపట్టడానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ క్రమంలో అప్పటి రోడ్డురవాణాశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2017 ఫిబ్రవరి 5న పలుగుల వద్ద గోదావరి తీరాన్ని అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి సందర్శించారు.
ఏడేళ్లు గడిచినా..
పలుగుల గోదావరిలో మట్టి నమూనా పరీక్షలు చేసి ఏడేండ్లు గడిచినా వంతెన నిర్మాణంపై పురోగతి లేకపోవడంతో ఈ ప్రాంత వాసులు నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం పలుగుల వద్ద వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అన్నారం వద్ద వంతెన కమ్ బ్యారేజీ అందుబాటులో ఉంది. కానీ ఆ వంతెన మీదుగా భారీ వాహనాలు వెళ్లడానికి అనుమతి లేదు. పలుగుల వద్ద వంతెన నిర్మాణం పూర్తయితే శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు కొమురంభీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు, మహారాష్ట్ర చంద్రాపూర్, నాగ్‌పూర్ గుండా ప్రయాణం దూరం తగ్గనుంది. పలుగుల, మద్దులపల్లి వాసులు నిత్యావసరాలకు, వైద్య, వ్యాపారపరంగా పొరుగున ఉన్న మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు వెళ్తుంటారు. ప్రస్తుతం కాళేశ్వరం, సిరొంచ మీదుగా చెన్నూర్ వెళ్లాలంటే 50–60 కిలోమీటర్ల దూరం వస్తుంది. పలుగుల వద్ద వంతెన నిర్మిస్తే 4–5 కిలోమీటర్ల దూరంతో సులువుగా చెన్నూర్‌కు చేరుకుంటామని స్థానికులు పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణంతో కొమురంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యాలు పెరిగి దూరభారం తగ్గనుంది.
మొదట రూ.110 కోట్లతో ప్రతిపాదనలు..
2012లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ ఎంపీ, ప్రస్తుతం చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ రూ.110కోట్ల వ్యయంతో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి స్పీడప్ చేశారు. ఆమోదం తెలిపి నిధులు మంజూరయ్యే సమయంలో అప్పుడు ఎన్నికలు రావడంతో నిలిచింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2017లో పరీక్షలు చేసినా ఫలితం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పాటు మంథని, చెన్నూర్‌లో మంత్రులుగా శ్రీధర్‌బాబు, వివేక్, పెద్దపల్లి ఎంపీ వంఽశీకృష్ణ ఉండడంతో మళ్లీ రెండు జిల్లాల ప్రజలకు ఆశలు చిగిరిస్తున్నాయి. స్థానికులు నిధులు మంజూరుచేసి వంతెన నిర్మాణం పూర్తిచేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వంతెన నిర్మించాలి
పలుగుల–చెన్నూర్ మధ్యలో వంతెన నిర్మిస్తే దూర భారం తగ్గుతుంది. పలుగుల గ్రామస్తులం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాం. పలుగుల నుంచి చెన్నూర్‌కు(మద్యలో గోదావరి) ఐదు కిలోమీటర్లు. ఇక్కడి నుంచి కాళేశ్వరం మీదుగా సిరొంచ నుంచి చెన్నూర్‌కు 60కిలోమీటర్లు ఉంటుంది. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. వంతెన నిర్మాణం చేపడితే అన్ని రకాల వసతులు, ప్రయాణ సౌకర్యాలు అందుతాయి. మట్టి పరీక్షలు చేసినా ఫలితం లేదు.
– బర్ల కుమార్, పలుగుల, రైతు
రవాణా మెరుగు
పలుగుల–చెన్నూర్ మధ్య గోదావరిపై వంతెన నిర్మిస్తే రవాణా మెరుగు పడుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు రాకపోకలు పెరిగి అభివృద్ధి జరుగుతుంది. వ్యాపార, వాణిజ్య, వైద్య పరంగా మార్కెట్ అభివృద్ధి చెందుతుంది. రైతులకు రైతు మార్కెట్, ఎరువులు, మందులు దగ్గరవుతాయి. ప్రస్తుతం చెన్నూరు నుంచి సిరొంచ మీదుగా కాళేశ్వరం వెళ్లాలంటే 35 కిలోమీటర్లు, పలుగుల వద్ద వంతెన నిర్మాణంతో 12 కిలోమీటర్లతో వెళ్లొచ్చు.
పోగుల ఉదయ్, చెన్నూర్, మంచిర్యాల జిల్లా
ఏళ్లుగా ఎదురుచూస్తున్న రెండు జిల్లాల ప్రజలు
పలుగుల–చెన్నూర్ మధ్య గోదావరిపై నిర్మాణానికి ప్రతిపాదనలు
వంతెన నిర్మాణంతో
తగ్గనున్న దూరభారం
2013లో రూ.110 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు

వంతెన కోసం నిరీక్షణ

వంతెన కోసం నిరీక్షణ

వంతెన కోసం నిరీక్షణ