
పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కాటారం: గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. కాటారం మండలం దామెరకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గంగారం మోడల్ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దామెరకుంట గురుకుల పాఠశాల ఆవరణ, డైనింగ్ హాల్, వంటగది, వంట సామగ్రి, కూరగాయలను ఆయన పరిశీలించారు. వంటగదిలో ఈగలు ముసురుకోవడం, వంటగది పరిసరాలు, కూరగాయలు అపరిశుభ్రంగా ఉండటంపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆహార తయారీ ప్రదేశాలు ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, మెనూ ప్రకారం భోజనం అందించాలని ఉత్తమ విద్యాబోధన చేయాలని పేర్కొన్నారు. మళ్లీ తనిఖీకి వచ్చే సరికి ఇది పునరావృతం కావద్దని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని సమకూరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భవనం పెచ్చులు ఊడిపోతుందని, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తరగతి గదులు సరిపోవడం లేదని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పాఠశాల వెనకాల నిరుపయోగంగా ఉన్న జూనియర్ కళాశాల భవనానికి మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఈడబ్యూఐడీసీ ఈఈని ఫోన్‌లో ఆదేశించారు. అనంతరం గంగారం మోడల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హాస్టల్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సీసీ రోడ్డు నిర్మాణం, వంట గది నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వేడినీటి కోసం గీజర్లతో పాటు కావాల్సిన మౌలిక వసతుల కోసం నివేదిక అందించాలని తెలిపారు. కలెక్టర్ వెంట డీఈఓ రాజేందర్, తహసీల్దార్ నాగరాజు ఉన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేయాలి..
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్ట్ భూ సేకరణ పనులు, భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల వివరాలపై ఆరాతీశారు. మండలంలో 5610 దరఖాస్తులు రాగా 412 మంది దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ నాగరాజు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ నాగరాజు, నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్‌ఐ వెంకన్న ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
గురుకులంలో అపరిశుభ్రతపై
కలెక్టర్ సీరియస్