
కొత్త వ్యక్తులకు ఆశ్రయమివ్వొద్దు
కాళేశ్వరం: గ్రామాల్లో కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని, అలాంటివారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. సీఐ రామచందర్‌రావు, ఎస్సై తమాషారెడ్డిలతో కలిసి శనివారం సాయంత్రం ఆయన మహదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించి, గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో వాహన పత్రాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. పెండింగ్ చలానా ఉన్న వాహనాలను క్లియర్ చేయించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని, అలాంటి కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. యువత మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. చెడు వ్యవసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. గంజాయి, గుడుంబా, మట్కాలకు అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే గ్రామస్తులు సహకరించొద్దని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్ పోలీసులు ఉన్నారు.
రహదారిని పునఃప్రారంభించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం రోడ్డుకు అడ్డుగా కాల్వ తీయడం సరికాదని, రహదారిని పునఃరుద్ధరించాలని కోరుతూ పట్టణంలోని కారల్‌మార్క్స్‌కాలనీ వాసులు శనివారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజ్ సతీష్ మాట్లాడుతూ.. కారల్‌మార్క్స్ కాలనీలోని 25వ వార్డు పరిధిలో సింగరేణి పాఠశాల పక్క న కాలనీకి వెళ్లే రోడ్డుకు సింగరేణి యాజ మాన్యం కాల్వ తీసినట్లు తెలిపారు. 30 సంవత్సరాల క్రితం కాలనీ వాసులు సౌలభ్యం కోసం రోడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోడ్డు మూసి వేయడంతో విద్యార్థులు, 6వ గనికి వెళ్లే కార్మికులు, సులభ్ కాంప్లెక్స్ వెళ్లే కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రోడ్డు పున:ప్రారంభించాలని కోరుతూ జీఎంకు కాలనీవాసులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు తిరుపతిరెడ్డి, రవి, రాజు, మహేష్, చంద్రయ్య, వెంకన్న, సురేష్, వెంకటేష్ పాల్గొన్నారు.
సమ్మక్కసాగర్ వద్ద తగ్గిన నీటి ప్రవాహం
కన్నాయిగూడెం: రెండు రోజుల పాటు ఉగ్రరూపంలో ప్రవహించిన గోదావరి నీటి ప్రవాహం శనివారం కొంతమేర తగ్గింది. తుపాకులగూడెం వద్ద గోదావరిపై సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద శుక్రవాకం ఎగువ నుంచి 7 లక్షల పైబడి క్యూసెక్కుల నీరు ప్రవహించింది. శనివారం నాటికి 2 లక్షల క్యూసెక్కుల మేర తగ్గి 5,20,630 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 80.50 మీటర్ల నీటి మట్టం ఉంది.
భూ పోరాటాలకు దిక్సూచి ఓంకార్
ములుగు రూరల్: రైతాంగ భూ పోరాటాలకు దిక్సూచి ఓంకార్ అని ఎంసీపీఐ(యూ)రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఓంకార్ శతజయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, నర్సంపేట నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన నేత ఓంకార్ అని అన్నారు. ఓంకార్ తన జీవితాన్ని పీడిత ప్రజల విముక్తికి అంకితం చేశారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.67 వేల ఎకరాల భూమిని పేదలకు దక్కే విధంగా కృషి చేశారని కొనియాడారు.

కొత్త వ్యక్తులకు ఆశ్రయమివ్వొద్దు

కొత్త వ్యక్తులకు ఆశ్రయమివ్వొద్దు