
కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు నిర్ణయించడం హర్షనీయమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని బలహీన వర్గాల హక్కుల కోసం బీసీ 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, బీసీ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
భూపాలపల్లి రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తపల్లి గోరి గ్రామ ఎంపీటీసీ పరిధిలోని ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీలు, మండల ప్రాదేశిక ఎన్నికల్లో అన్నింటా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని దిశా, నిర్దేశం చేశారు. ప్రజాభిమానం ఉన్న వారికే టికెట్లు వస్తాయని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తల ముఖంలో ఆనందం చూడాలంటే వారికి కూడా అధికారం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో క్రమశిక్షణ తప్పిన వారిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హెచ్చరించారు.