
దందా
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025
ఆగని ఇసుక
ఉదయం 6 గంటలకే కాల్వపల్లి నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు
● మానేరు వాగు నుంచి జోరుగా రవాణా
● తెల్లవారుజాము నుంచే లోడింగ్
● ఒక్క కూపన్‌తో రెండు, మూడు ట్రిప్పులు
● అమలు కాని అధికారుల ఆదేశాలు
● అధిక ధరలకు ఇసుక విక్రయాలు
భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సమీక్షలు నిర్వహించి మానేరు వాగులో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి నిబంధనలు విధించి, తగు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదు. ఇసుకాసురులు షరా మాములుగానే తమ దందాను కొనసాగి స్తున్నారు.
అధికారులు ఆదేశించినా..
కాళేశ్వరం ఇసుక కంటే జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల మండలాల మీదుగా ప్రవహించే మానేరు వాగులోని ఇసుక నాణ్యత ఎక్కువగా ఉండటంతో డిమాండ్ ఉంటుంది. జిల్లాకేంద్రంతో పాటు మండలాల్లో కాంట్రాక్టు పనులు, బిల్డింగ్‌ల నిర్మాణానికి ఇక్కడి ఇసుకనే వినియోగిస్తుంటారు. దీంతో మానేరు వాగు నుంచి గతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరిగేది. ఈ అక్రమ దందాకు ఎలాగైనా చెక్ పెట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులు భావించారు. ఈమేరకు ఈ నెల 5వ తేదీన చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల తహసీల్దార్లు, పోలీసు అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించిన టోకెన్లు ఉన్న వారికి మాత్రమే మానేరులో ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్‌కు అనుమతి ఇవ్వాలని, అది కూడా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్ధేశించిన ధరలకు మాత్రమే రవాణా చేయాలని ఆదేశించారు. అయినా దందా అలాగే కొనసాగుతుంది.
సమయపాలన లేదు..
అధిక ధరలకు విక్రయాలు..
కలికోటపల్లి, కాల్వపల్లి వద్ద మానేరులో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే టోకెన్ ఉన్న వారు ఇసుక లోడింగ్ చేసుకొని రవాణా చేసుకోవచ్చని రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రకటించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే మానేరులో ఒక్కో చోట సుమారు 20 ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి. అధికారులు రాకముందే ఒక్కో ట్రాక్టర్ యజమాని రెండు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా మానేరు వాగులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద ఉండే కొందరు సిబ్బంది సహకారంతో కొందరు ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇళ్ల ఒక్క టోకెన్‌తో రెండు, మూడు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారం పడొద్దనే ఉద్దేశంతో కలెక్టర్ రాహుల్ శర్మ మండలాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక ధరను నిర్ణయించారు. అయినప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం అధిక ధరలకే విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్ ఇసుకను ప్రస్తుతం చిట్యాల మండలంలో రూ. 4వేలు, టేకుమట్లలో రూ.3,500, రేగొండలో రూ.4,500, భూపాలపల్లిలో రూ.5వేల నుంచి రూ.5,500 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
టిప్పర్‌లలో హైదరాబాద్‌కు రవాణా..
మానేరు ఇసుకను కొందరు వ్యక్తులు అక్రమంగా హైదరాబాద్‌కు సైతం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల కూపన్‌లు తీసుకొని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతానికి తరలించి డంప్ చేస్తున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో డంప్ చేశాక అధికారుల కదలికలను గమనిస్తూ టిప్పర్‌లలో లోడ్ చేయించి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న అర్ధరాత్రి రేగొండ మండలకేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లు, ఇసుక లోడ్ చేసిన ఒక పొక్లెయినర్‌ను సీసీఎస్ పోలీసులు పట్టుకొని ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
న్యూస్‌రీల్
అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు..
నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణాకు అనుమతులు ఇస్తున్నాం. మానేరులో ఇసుక తోడే ప్రాంతంలో సిబ్బందిని ఏర్పాటు చేశాం. టోకెన్ ఉన్న ట్రాక్టర్లనే వాగు లోపలికి అనుమతి ఇస్తారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు.
– విజయలక్ష్మి, తహసీల్దార్, టేకుమట్ల

దందా