
కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం
చిట్యాల: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆవరణలో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు డీఆర్‌డీఏ, సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షత వహించగా.. మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు. మహిళలు సరికొత్త ఆలోచనలతో నూతన వ్యాపారాలను చేపట్టి అభివృద్ధి చెందాలని కోరారు. మహిళలకు పొదుపు సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆర్‌టీసీ బస్సులను ప్రారంభించారు. బ్యాంక్ లింకేజీ, వడ్డీలేని రుణాలు, లోన్‌బీమా, ప్రమాద బీమా, ఇందిరా మహిళా శక్తి యూనిట్ల కింద రుణాలు, ఆర్‌టీసీ బస్సుల కిరాయి చెక్కులను అందజేశారు.
అభివృద్ధి దిశగా నియోజకవర్గం..
భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. విద్య, వైద్యం పరంగా ఇబ్బందులు లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మోరంచపల్లి బాధితులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిహారం చెల్లించామని గుర్తుచేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ డైరెక్టర్ రజని, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీసీఓ, మండల ప్రత్యేక అధికారి వాల్యూనాయక్, ఆర్డీఓ రవి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఎంపీడీఓ జయశ్రీ, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
మంత్రి సీతక్క

కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం