
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
గణపురం: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు న మ్మకం కలిగేలా నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న వైద్యసేవలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే వైద్యసేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఆపరేషన్ గదితోపాటు ఫార్మసీని తనిఖీ చేసి సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీదేవి, పోగ్రాం ఆఫీసర్ ఉమాదేవితోపాటు సిబ్బంది ఉన్నారు.
వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలి
రేగొండ: సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా అన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని డీహెచ్ రవీంద్రనాయక్ అన్నారు. మండలంలోని తిరుమలగిరి ఆరోగ్య ఉపకేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. నీరు నిల్వ ఉన్న పాంతాల్లో లార్వాలు అభివృద్ధి చెందకుండా డ్రై డే పాటించాలని తెలిపారు. గర్భిణులకు క్రమంతప్పకుండా పరీక్షలు చేయించి, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం జరిగేలా చూడాలని సూచించారు. జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా శిశువులందరికీ సరైన సమయంలో టీకాలు వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి, పీఓ ఎన్‌సీడీ సందీప్, డీపీఓ చిరంజీవి, డీడీఎం మధు, మండల వైద్యాధికారి హిమబిందు, ఎఎన్‌ఎం సదాలక్ష్మి, దీనా, ఆశావర్కర్లు స్వప్న, సుమలత, వనిత, వజ్ర, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్
గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ