
కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం
కాటారం/కాళేశ్వరం: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం పర్యటించారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలల ఆవరణలో విద్యార్థులకు షూ పంపిణీ, వనమహోత్సవం, చిన్న కాళేశ్వరం రైతులతో సమావేశం, కాటారం మండలకేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కుల పంపిణీ, మహాముత్తారం ఎంపీడీఓ కార్యాలయం నూతన భవనం, రూ.73.50 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ కార్యాలయం భవనం, గోదాం ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహిళలను ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేస్తామని మంత్రి అన్నారు. మహిళా సంఘాల ద్వారా కోటి రూపాయలతో సోలార్ విద్యుత్ ఫ్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలానికి వంద మంది మహిళలకు కుట్టు మిషన్ నేర్పించే కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్‌డీఏ అధికారులను మంత్రి ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
కమిట్‌మెంట్‌తో పనిచేస్తా..
మంత్రిగా ఒక కమిట్‌మెంట్‌తో పనిచేస్తానని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మహదేవపూర్‌లో 650 మంది విద్యార్థులకు పాఠశాల షూస్, స్పోర్ట్స్ షూస్‌లను పంపిణీ చేశారు. ఖేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున కృషి చేస్తుందని తెలిపారు. మండలంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 245 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం గొప్ప విషయం అని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు వెంట కలెక్టర్ రాహుల్‌శర్మ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీఈఓ రాజేందర్, తహసీల్దార్లు నాగరాజు, శ్రీనివాస్, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మహదేవపూర్ ఉన్నత పాఠశాలలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలు ఉపాధి రంగాలను
వినియోగించుకోవాలి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
శ్రీధర్‌బాబు

కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం