భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం సంబంధిత అధికారులు సతమతమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి వేలల్లో వినతులు వచ్చాయి. వందల సంఖ్యలోనే పరిష్కారానికి అవకాశం కలుగుతోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు. దరఖాస్తులు పెట్టుకున్న రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సాదాబైనామాలు..
సాదాబైనామాలు, పీఓటీ, ప్రభుత్వ భూములకు సంబంధించి 18వేలకు పైగా ఆర్జీలు వచ్చాయి. తెల్ల కాగితాలపై జరిగిన భూ క్రయవిక్రయాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో వేలాది మంది ఈ సమస్య పరిష్కారం కోసం వేచిచూస్తున్నారు. మిగతావి సర్వేనంబర్ మిస్సింగ్, డిజిటల్ సైన్ పెండింగ్‌పై వచ్చాయి. మిగతా దరఖాస్తుల్లో కోర్టు కేసులు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, భూమి రకంలో మార్పు, విరాసత్, కుటుంబ సభ్యుల పేర్లలో తప్పులు తదితర సమస్యలపై వచ్చినవి ఉన్నాయి. వీటన్నింటినీ అధి కారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు నోటీసులు ఇస్తూ దరఖాస్తుదారుల వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలు పరిశీలిస్తున్నారు.
వేలాదిగా వచ్చిన దరఖాస్తులు
● ఆగస్టు 15వరకు
పూర్తిచేయాలని ప్రభుత్వ ఆదేశం
● వందల్లోనే సమస్యలు పరిష్కారం
● కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ
● సాదాబైనామాలకు కలగని మోక్షం
మిస్సింగ్ సర్వే
నంబర్ 5,724
అసైన్డ్ ల్యాండ్: 10,031
సక్సెసెషన్ 3,599
పీఓటీ 3,159
సాదాబైనామా 5,179
డీఎస్ పెండింగ్1,720
వేల దరఖాస్తులు.. దగ్గర పడుతున్న గడువు
జిల్లావ్యాప్తంగా గత నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన భూ భారతి గ్రామ సదస్సుల ద్వారా జిల్లాలోని 11 మండలాల్లో 48,651 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 200పైచిలుకు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ఇంకా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీలోపు భూభారతి ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గడువులోపు దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యేలా లేదు.
తిరస్కరణకు అధికం
అధికారులు స్వీకరించిన దరఖాస్తుల్లో అత్యధికంగా తిరస్కరణకు గురవుతున్నట్లు తెలిసింది. భూమిని పట్టా చేసేందుకు అధికారులు రైతులకు అనేక చిక్కుముడులు పెడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముందుగా డిజిటల్ సైన్ పెండింగ్, సక్సెషన్‌పై వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. డీఎస్ చేసేందుకు రైతుల నుంచి పాత పాసు పుస్తకాలు ఉండాలని, రెవెన్యూ రికార్డుల్లోని పహణీల్లో కాస్తు కాలంతో పాటు పట్టాదారు కాలంలో ప్రస్తుతం దరఖాస్తు రైతుల పేర్లు ఉండాలని సూచించారు. సక్సెషన్‌కు సంబంధించి బాధలు అనేకం ఉన్నాయి. రెండు తరాల క్రితం చనిపోయిన పట్టాదారు (రైతు) డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధనలు విధించారు. అన్నీ ఉన్నా ఆర్‌ఎస్‌ఆర్(సెత్వార్)లో వ్యత్యాసం ఉందని దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు.
పరిశీలన వేగవంతం చేస్తాం..
జిల్లాలో భూభారతి ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేస్తున్నాం. ఇప్పటివరకు మండలాల వారీగా టీమ్‌లు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు పూర్తి చేస్తాం. ఆర్‌ఎస్‌ఎస్ సమస్యలను పరిష్కరించేందుకు భూముల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించి అనర్హులకు నోటీసులు అందించి వారి పేర్లు తొలగిస్తాం. త్వరలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు, జీపీఓలు అందుబాటులోకి రానున్నారు.
– అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్
●
భూభారతి పెండింగ్!
భూభారతి పెండింగ్!