
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి రూరల్: స్వయం ఉపాధి, పునరావాసం కోసం జిల్లాలోని దివ్యాంగులు ఈనెల 14నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి మల్లీశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్సిడీతో రుణాలు మంజూరుచేయనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువ పత్రాలను మున్సిపల్ పరిధివారు మున్సిపల్ కార్యాలయంలో, మండలాల వారు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాలన్నారు. మరిన్ని వివరాలకు 96523 11804 లేదా కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శిగా
రాజ్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: సీపీఐ జిల్లా కార్యదర్శిగా కొరిమి రాజ్‌కుమార్ ఐదవ సారి ఎన్నికయ్యారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా గురుజపెల్లి సుధాకర్‌రెడ్డి, పైళ్ల శాంతికుమార్, 29మంది కౌన్సిల్ మెంబర్స్, 11మంది జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
అభివృద్ధి పనులకు
శంకుస్థాపనలు
గణపురం: మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.52లక్షల నిధులతో ధర్మరావుపేట గ్రామంలో శివాలయానికి ప్రహరీ, బస్వరాజ్‌పల్లిలో గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు, గొల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మొగుళ్లపల్లి: మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మండలంలోని చింతలపల్లి గ్రామ శివారులో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమతి పత్రాలులేని రెండు ఇసుక ట్రాక్టర్లు మండలకేంద్రం శివారులోని పెద్దవాగు నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రాక్టర్ ఓనర్లు పోతుగల్ గ్రామానికి చెందిన గాజుల పరమేష్, బొల్లెపల్లి రాములు, పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి శ్రీను, డ్రైవర్లపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
పత్తిచేనులోకి
దూసుకెళ్లిన కారు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో మహా రాష్ట్రకు చెందిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లిది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం మహరాష్ట్రలోని గడ్చిరోలి నుంచి కాళేశ్వరం వస్తుండగా అంతర్రాష్ట్ర వంతెన దాటిని తర్వాత వేగంగా రావడంతో అదుపుతప్పి జాతీయ రహదారి 353(సీ) నుంచి 150 మీటర్ల దూరంలో పత్తి చేనులోకి వెళ్లింది. ప్రమాదంతో కారు డ్రైవర్ తలకు, మొహంపై స్వల్పగాయాలు అయ్యాయి. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కారులో మహారాష్ట్రలో వాడే దేశీదార్ మద్యం కాటన్లు ఉన్నట్లు సమాచారం. మద్యం బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లారని ప్రచారం జరుగుతుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీస్తున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం