రేగొండ: మండలంలోని కోటంచ ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం ఆది వారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. ఆది వారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంత రం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనా ధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13వ తేదీన జరిగే పాలిసెట్–2025 నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయినట్లు పాలిసెట్ జిల్లా కన్వీనర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 864మంది పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 384, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 240, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 240 విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులు తమవెంట పెన్సిల్, బ్లాక్ బాల్‌పెన్ మాత్రమే తీసుకొని పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఏ రకమైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి అర్బన్: నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణలో నిమగ్నమై ఉన్నందున ప్రజా వాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇవ్వడానికి రావొద్దని సూచించారు.
మృతుడి కుటుంబానికి మంత్రి పరామర్శ
కాటారం: కాటారం మండలం ధన్వాడలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తుల్సెగారి రాజలింగు కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. అధైర్యపడవద్దని న్యాయం జరిగేలా చూస్తామని మృతుడి కుటుంబానికి మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట నాయకులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
లక్ష్మీనరసింహస్వామి కల్యాణం


