ఉద్యోగ అవకాశాల కల్పనకే ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రైనింగ్ సెంటర్‌లో 38 రకాల కోర్సుల్లో అభ్యర్థులకు శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో ఉచిత మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు యువతకు వివిధ రంగాల్లో స్కిల్ యూనివర్సిటీ శిక్షణ ఇస్తుందని తెలిపారు. దేశంలో నిరుద్యోగమే పెద్ద సమస్యగా మారిందని, ఉద్యోగాలు లేక యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కష్టపడి చదివి డిగ్రీ పట్టాలు పొంది బయటకు వచ్చిన యువతకు సరైన స్కిల్స్ ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిద్వారా యువత అవసరమైన నైపుణ్యాలను నేర్చుకొని ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు రాజ్‌కుమార్, రాజేందర్, సింగరేణి అధికార ప్రతినిధి మారుతీ, అధికారులు నరసింహులు, రఘుపతి, కవీంద్ర, జోతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


