భూపాలపల్లి రూరల్: ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ కిరణ్‌ఖరే పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజాదివస్‌లో భాగంగా ఎస్పీ కార్యాలయంలో 16మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బాధితుల సమస్యలు సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
చర్యలు తీసుకోవాలి
భూపాలపల్లి రూరల్: గ్యాస్ సిలండర్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాస్ గోదాముల యాజమానులపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతి సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భిక్షపతి మాట్లాడారు. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పటికీ హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ సిలెండర్లను రూ.100నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాస్ ఏజెన్సీలతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు బెల్పగొండ మహేందర్, మేకల ఓంకార్, మురారి సదానందం, కొయ్యడ దామోదర్ ఉన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జిల్లాలో 18 సంవత్సరాల బాలబాలికలు పీఎంఆర్‌బీపీ పురష్కారం కోసం జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ సంక్షేమాధికారి మల్లీశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏరంగంలోనైనా, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళ, సంస్కృతి, సైన్స్ టెక్నాలజీలలో ప్రతిభ కనబర్చిన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 94910 51676 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ముగిసిన జాతర వేలం పాటలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 8నుంచి 17 వరకు జరుగనున్న లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) వేలం పాటలు వాయిదా పడిన విషయం విదితమే. ఈ వేలం పాటలను ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో సోమవారం నిర్వహించారు. జాతర సందర్భంగా మే 8వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆలయ ప్రాంగణం పరిధిలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారుచేసి విక్రయించేందుకు మల్లూరుకు చెందిన మారబోయిన గోవర్ధన్ రూ 3,19,116, స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాలు, పుట్టు వెంట్రుకలు పోగు చేసుకునేందుకు జగిత్యాలకు చెందిన ప్రసాదం రాంబాబు రూ 2,17,000లకు వేలం పాటను దక్కించుకున్నట్లు ఈఓ సత్యనారాయణ తెలిపారు.
రేపు తెలుగుభాష పరిరక్షణపై చర్చా గోష్టి
హన్మకొండ కల్చరల్ : తెలుగుభాష పరిరక్షణపై ఈనెల 7న ఉదయం 10 గంటలకు హనుమకొండ పింజర్లరోడ్‌లోని రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయంలో చర్చా గోష్టి నిర్వహిస్తున్నట్లు కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ విద్యలో రెండో ఆప్షన్‌గా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ జీఓ జారీ చేసిందని, దీనిని వ్యతిరేకిస్తూ తెలుగు భాషాభిమానులు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, కవులు, రచయితలు నిరసన వ్యక్తం చేయగా జీఓ రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించినా ఇప్పటి వరకు కళాశాలలకు ఉత్తర్వులు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొనాలని కోరారు.

ఫిర్యాదులపై స్పందించాలి