కాటారం: కొన్ని రోజులుగా జాడ లేకుండా పోయిన పెద్దపులి ఒక్కసారిగా తన పంజా విసిరింది. కాటారం మండలంలోని జాదారావుపేట గ్రామపంచాయతీ పరిధిలో రఘుపల్లి అటవీ ప్రాంతానికి సమీపంలోని చెరువు కట్ట వద్ద మంగళవారం ఆరేళ్ల ఆవుదూడను పులి చంపేసింది. అటు వైపుగా వెళ్లిన ఓ మేకల కాపరి మృతి చెందిన ఆవుదూడను గమనించి స్థానికులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లగా పులి ఆవుదూడపై దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పులి దూడ గొంతు వద్ద గాయం చేసి రక్తం తాగి వదిలేసి వెళ్లినట్లు అఽధికారులు తెలిపారు. పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని పులి మూగజీవాలపై దాడిచేసి మొదటగా రక్తం తాగుతుందని.. మరుసటి రోజు చంపిన జీవిని తినడానికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. పులి ఆవుదూడను చంపిన విషయం తెలియడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో పులి ఎటు నుంచి వస్తుందో తెలియక అయోమయంతో జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి జాడ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రజలు, రైతులు, కాపర్లు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని కాటారం రేంజ్ రేంజర్ స్వాతి హెచ్చరించారు. అడవుల్లో ఉచ్చులు అమర్చవద్దని, పులికి హాని చేసేలా వ్యవహరించవద్దని చెప్పారు. పులికి సంబంధించిన ఆనవాళ్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రేంజర్ కోరారు.