ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మమేకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీలు నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు.
గవర్నర్‌కు సన్మానం..
జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు.
అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు
కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రావుల సునిత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు.
కొండపర్తిని దత్తత తీసుకోవడం
గొప్ప విషయం: మంత్రి సీతక్క
దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు.
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి:
దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి
కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్ధాలనేదే లక్ష్యమని గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్రవ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఆదివాసీలతో మమేకమైన గవర్నర్
జిష్ణుదేవ్‌వర్మకు ఘనస్వాగతం
పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం
భారీ పోలీసు భద్రత నడుమ సాగిన
పర్యటన
పులకించిన కొండపర్తి
పులకించిన కొండపర్తి
పులకించిన కొండపర్తి