‘గ్రావెల్‌’ మాఫియా | - | Sakshi
Sakshi News home page

‘గ్రావెల్‌’ మాఫియా

Mar 10 2025 10:44 AM | Updated on Mar 10 2025 10:39 AM

హనుమకొండ జిల్లా దామెర మండలంలో యంత్రాలతో యఽథేచ్ఛగా మొరం తవ్వకాలు, తరలింపు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

ధికారులు, రాజకీయ నాయకుల అండదండతో అనుమతుల పేరిట సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మొరం(గ్రావెల్‌) తవ్వేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ చుట్టూ ఉన్న దామెర, హసన్‌పర్తి, గీసుకొండ, శాయంపేట, ధర్మసాగర్‌ తదితర మండలాల్లో గ్రావెల్‌ మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. కొందరు మొరం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి టెంపరరీ పర్మిట్ల(టీపీ)తో పట్టా భూములు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వేస్తున్నారు. చాలాచోట్ల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాకతీయ కాల్వ గట్లను తవ్వుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

దోపిడీ సాగుతోందిలా..

గ్రావెల్‌ మాఫియా టీఎస్‌ఎంఎంసీ రూల్స్‌ 1966–9(4) ప్రకారం పట్టాభూములు, రైతుల పేరిట రెండు నెలల గడువుతో తాత్కాలిక అనుమతులు పొందుతూ ఇష్టారాజ్యంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో ఏరియాను బట్టి 8–12 అడుగులలోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే రెండున్నర హెక్టార్లలో సుమారు 7–8 వేల మెట్రిక్‌ టన్నుల గ్రావెల్‌ మాత్రమే వస్తుందని మైనింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రావెల్‌ మాఫియా అందుకు భిన్నంగా 15–30 అడుగుల లోతు వరకు తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో మొరం తరలిస్తున్నారు. ఇందుకు సుమారు రెండున్నర హెక్టార్ల కోసం రూ.1.50 లక్షల వరకు రాయల్టీ చెల్లిస్తూ.. రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. కళ్లెదుటే ఈ అక్రమం జరుగుతున్నా.. ఏ శాఖ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కంచికి చేరిన కోమటిపల్లి గుట్ట దందా..

హసన్‌పర్తి మండలం భీమారం శివారు 340 సర్వే నంబర్‌లో సుమారు 57 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్‌ మేనేజ్‌మెట్‌ కళాశాల, ఇంటర్నేషనల్‌ స్డేడియం ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఓవైపు కళాశాలలకు కేటాయించిన సర్కార్‌ మరోవైపు 340/1 సర్వే నంబర్‌ పేరిట రెండున్నర హెక్టార్ల(3.260) భూమిని కె.నవీన్‌రావు పేరిట క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 సంవత్సరాల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్‌1/ డబ్ల్యూజీఎల్‌/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. క్యూబిక్‌ మీటర్‌కు రూ.30ల చొప్పున 29,90,900 క్యూబిక్‌ మీటర్లకు అగ్రిమెంట్‌ కుదుర్చుకుని గుట్టంతా ఖాళీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రూ.లక్షల ప్రజాధనం పక్కదారి పట్టినా.. ఈ దందాలో తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్‌ పార్టనర్‌గా ఉండటం వల్ల అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే

చర్యలు

మొరం తరలింపులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి.

– జ్యోతివరలక్ష్మీదేవి, తహసీల్దార్‌, దామెర

అంతా అనధికారమే!

కొంత అనుమతి తీసుకుని గుట్టలను కరిగించడమే కాదు.. అసలు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం ఉమ్మడి వరంగల్‌లో పరిపాటిగా మారింది. వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొరం, మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిసినా అధికారులు ‘మాములు’గా తీసుకుంటున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం జంగిలిగొండలోని ప్రభుత్వ భూమిలో గతంలో తవ్వకాలు జరుగుతుండగా అధికారులు అడ్డుకుని హద్దులు ఏర్పాటు చేసినా ఆగడం లేదు.

ములుగు జిల్లా ములుగు పంచాయతీ శివారు 837 సర్వే నంబర్‌లోని సుమారు 200 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించగా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదు.

వరంగల్‌ నగరానికి సమీపాన ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున సుమారు 500 ట్రిప్పుల మొరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.12.50 లక్షలు ఆర్జిస్తున్నారు.

జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ ఎన్నె చెరువు పక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను రాత్రి పూట పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తవ్వి మట్టిని తరలించారు. చంపక్‌హిల్స్‌ గుట్టల్లోనూ మట్టిని తోడేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి.

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, వంచనగిరి ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన, కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు వాటికి ఇరువైపులా బ్యాంకింగ్‌ పేరుతో పోసిన కట్టల మొరాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారు.

యథేచ్ఛగా మొరం తవ్వకాలు

అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట

కాల్వగట్లు, గుట్టలనూ వదలని

అక్రమార్కులు

‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement