కాటారం: పులి నివసించడానికి అనువైన ప్రదేశం కాదు..దట్టమైన అటవీ ప్రాంతం అసలే కాదు.. కానీ ఎక్కడి నుంచో వచ్చిన పెద్దపులి ఇక్కడే 18 రోజులుగా తిష్టవేసింది. ఎటు వెళ్లాలో దారి దొరకకనో లేక స్థిర ఆవాసం కోసం ప్రయత్నిస్తుందో ఏమో కానీ పులి కాటారం, మహదేవపూర్ అడవి ప్రాంతంలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సంచరిస్తుంది. రెండు రోజులకు ఒక చోట ఆనవాళ్లు వదులుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఫిబ్రవరి 10న మహదేవపూర్ రేంజ్ పరిధిలోని కాటారం మండలం నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో ఓ రైతుకు పులి కనిపించడంతో పులి సంచారం ప్రచారంలోకి వచ్చింది. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు (ప్లగ్‌మార్క్స్) గుర్తించి సంచారంపై ఆరా తీశారు. మరుసటి రోజు కాటారం రేంజ్ పరిధిలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో పులి తిరిగినట్లు అధికారులకు ఆనవాళ్లు లభించాయి. అనంతరం మహదేవపూర్ మండలం కుదురుపల్లి, పల్గుల, బీరాసాగర్, గుండ్రాత్‌పల్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించినట్లు పలువురు తెలపడంతో అధికారులు పాదముద్రలు గుర్తించి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటుచేసి పులి కదలికలపై నిఘా పెట్టారు. కానీ ఎక్కడ కూడా పులి కెమెరాలకు చిక్కిన దాఖలాలు లేవు. మధ్యలో రెండు, మూడు రోజులు జాడా లేకుండా పోయిన పులి రెండు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లిలో దర్శనమిచ్చింది. అక్కడి నుంచి ప్రతాపగిరి అడవుల్లోకి పులి చేరినట్లు శుక్రవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు శనివారం ప్రతాపగిరి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఓ వాగు వద్ద నీరు తాగినట్లు పాదముద్రల ఆనవాళ్లు సేకరించారు. నస్తూర్‌పల్లి అడవి వైపుగా వచ్చినట్లు కొంత దూరం పాదముద్రలు ఉన్నాయని కానీ ఎటు వెళ్లిందనేది మాత్రం స్పష్టత లేదని అటవీశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.
ఇక్కడిక్కడే..
గతంలో రెండు మార్లు పులి కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో సంచరించినప్పటికీ ఎప్పుడు కూడా మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉన్న దాఖలాలు లేవు. కానీ 18 రోజులుగా పులి ఇక్కడిక్కడే తచ్చాడుతుండటంతో దారి దొరకక ఎటు వెళ్లలేక ఉండిపోతుందో లేక ఈ అటవీ ప్రాంతంలో శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువైన స్థలం కోసం చూస్తుందో అంతుచిక్కకుండా పోయింది. ఒకటి రెండుమార్లు పులి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గోదావరి నదిని దాటి చెన్నూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి ప్రయత్నించినట్లు కొన్ని రోజుల క్రితం అటవీశాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. కాటా రం మండలం గుండ్రాత్‌పల్లి సమీపంలోని గోదావరి నది దాటడానికి వచ్చిన పులి కుక్కలు వెంటపడటంతో తిరిగి మహదేవపూర్ అడవిలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అటు నుంచి మళ్లిన పులి కాటారం, మహదేవపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో కలియ తిరుగుతుంది. పులి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఏ వైపుగా వస్తుందో తెలియక అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులికి సంబంధించిన కదలికలను పూర్తి స్థాయిలో కనుక్కోవడం అటవీశాఖ అధికారులకు క్లిష్టతరంగా మారింది.
కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం
దారి దొరకకనా..ఆవాసం కోసమా..