బీఆర్‌ఎస్‌ కోటాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు? | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కోటాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు?

Feb 25 2025 1:44 AM | Updated on Feb 25 2025 1:41 AM

ఎమ్మెల్యే కోటా కింద

పెద్దలసభకు వెళ్లేదెవరు..?

ఉమ్మడి వరంగల్‌లో జోరుగా ఊహాగానాలు

సత్యవతి రాథోడ్‌కు మళ్లీ చాన్స్‌ దక్కేనా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు?

కాంగ్రెస్‌ పార్టీ కోటాలో పెరుగుతున్న

ఆశావహలు

తెరమీదకు అసెంబ్లీ ఎన్నికల హామీలు..

పావులు కదుపుతున్న సీనియర్లు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది. ఇదే సమయంలో వెలువడిన ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుల ఎన్నికల నగారా మోగింది. మార్చి 3న నోటిఫికేషన్‌, 20న పోలింగ్‌ ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ ఎన్నికలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం బీఆర్‌ఎస్‌ తిరిగి ఒక్కస్థానం లభించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ అధినేత ఈ ఐదుగురిలో మళ్లీ ఎవరికి చాన్స్‌ ఇస్తారు? ఉమ్మడి వరంగల్‌కు చెందిన సత్యవతి రాథోడ్‌ మళ్లీ అవకాశం ఉంటుందా? మరో సీనియర్‌కు అవకాశం కల్పిస్తారా? అన్న చర్చ ఆ పార్టీలో మొదలైంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్‌ రేసులో ఉండి.. అధిష్టానం హమీతో సీటు త్యాగం చేసిన ఆ పార్టీ సీనియర్లు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు.

కాంగి‘రేసు’లో పలువురు...

సోమవారం నుంచే మొదలైన పైరవీలు..

వరంగల్‌ ఉమ్మడి జిల్లానుంచి ఎమ్మెల్సీలతోపాటు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ల కోసం పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే పోటీ పడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వారికి ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సందర్భంగా పలువురికి టీపీసీసీ భరోసా ఇచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌లుగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, బెల్ల య్యనాయక్‌, ఐత ప్రకాశ్‌రెడ్డి తదితరులకు.. కుడా చైర్మన్‌గా ఇనుగాల వెంకట్రామి రెడ్డిలకు అధిష్టానం అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌ రేసునుంచి తప్పుకోవడంతో పాటు సీనియర్‌లుగా ఉన్న పలువురు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. సోమవారంనుంచే కొందరు ఆశావహులు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌, మంత్రుల, ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు మొదలెట్టారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి దొమ్మాటి సాంబయ్య, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర తదితరులు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌లుగా పదవుల పొందిన వారిలో ముగ్గురు కూడా ఎమ్మెల్సీగా చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవి ఉమ్మడి వరంగల్‌కు దక్కుతుందా? ఒకవేళ ఇస్తే ఎవరికి? అనే అంశాలు తేలనున్నాయన్న చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూస్తే ఈసారి కాంగ్రెస్‌– 4 స్థానాలు, బీఆర్‌ఎస్‌–1 స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికై న మీర్జా రియాజుల్‌ హసన్‌, ఎగ్గే మల్లేశం, మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పదవీ కాలం మార్చి 29తో ముగియనుండగా.. సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఉమ్మడి వరంగల్‌కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మళ్లీ ఎమ్మెల్సీ దక్కుతుందా? అన్న చర్చ జరుగుతున్నప్పటికీ... ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా కొనసాగిన సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన దయాకర్‌రావు పార్టీ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులతో సన్నిహితంగా ఉండటంతోపాటు పలు సందర్భాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా తన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌కు ఎమ్మెల్సీ ఇవ్వదలుచుకుంటే ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఐదు స్థానాల నుంచి ఒకే స్థానంతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో పార్టీ అధినేత కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement