
వాహన విడి పరికరాల వేలం ●
● ఎస్పీ కిరణ్‌ఖరే
భూపాలపల్లి: జిల్లా పోలీసుశాఖకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న వాహన విడి పరికరాలకు ఈ నెల 19న వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్‌ఖరే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో వేలం నిర్వహిస్తామన్నారు. 19న బుధవారం ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభం అవుతుందని, ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనేవారు, తమ ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు, రూ. 3వేల రుసుము చెల్లించాలన్నారు. కొనుగోలు చేయని వారి రుసుము తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఆర్మ్‌డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలోని ఎంటీఓ కిరణ్‌ను 87126 58170 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.
అటవీ భూమి అన్యాక్రాంతం కానివ్వొద్దు
భూపాలపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం ఎట్టి పరిస్థితుల్లో అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ సంరక్షణ, విజిలెన్స్ విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఇలుసింగ్ మీరు అటవీశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన చెల్పూరు రేంజ్ పరిధిలోని భూపాలపల్లి పట్టణ సమీపంలో గల అటవీశాఖ ఎకో పార్కును పరిశీలించారు. పార్కులో వాకింగ్ పాత్, చెట్టను పరిశీలించారు. జిల్లాకేంద్రంలో ఎకో పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. 171 సర్వే నంబర్‌లోని 106.34 ఎకరాల భూమి విషయమై అటవీశాఖకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఆ భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ వసంత, చెల్పూరు రేంజ్ అధికారి నాగరాజు, సిబ్బంది ఉన్నారు.
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. శాయంపేట చేనేత సహకార సంఘం దగ్గర నిల్వ ఉన్న వస్త్రాలు తక్షణమే కొనుగోలు చేసి పెండింగ్‌లో ఉన్న కార్మికుల బిల్లులను విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించినట్లు, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి సమస్యలను పరిష్కరించేలా చూస్తానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేవెంట కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎన్‌ఎస్సార్ సంపత్‌రావు, గండ్ర సత్యనారాయణరెడ్డి, కిషన్‌రావు ఉన్నారు.
పకడ్బందీగా నులిపురుగుల నివారణ
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటిదశ జాతీయ నులిపురుగుల నిర్మూళన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని వైద్యాధికారులను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం శుక్రవారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 0–19 సంవత్సరాల వయసున్న వారిలో నులిపురుగులతో రక్తహీనత ఏర్పడుతుందన్నారు. జిల్లాలో 67,050 మందికి అల్బెండజోల్ మాత్రలు వేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తప్పక పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయించాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొమురయ్య, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్‌డేవిడ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిరుపతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్, ప్రోగ్రాం అధికారి ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.

వాహన విడి పరికరాల వేలం ●