పోరాటం నుంచి సంక్షేమం వరకు | - | Sakshi
Sakshi News home page

పోరాటం నుంచి సంక్షేమం వరకు

Sep 18 2026 1:39 AM | Updated on Sep 18 2026 1:39 AM

తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లాకు ప్రత్యేక స్థానం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అమరుల త్యాగాల స్ఫూర్తితో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట

బైరాన్‌పల్లి నుంచి ఆకునూరు వరకు ఉద్యమ క్షేత్రాలే..

ప్రజాపాలన వేడుకల్లో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

జనగామ: తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లా ప్రాంతం కీలకపాత్ర పోషించిందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య గుర్తుచేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నాడు ప్రజలు సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, డీసీపీ రాజామహేంద్ర నాయక్‌(ఐపీఎస్‌), మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌తో కలిసి విప్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు జాతీయ గేయాలాపన చేయగా, విప్‌ జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత బీర్ల అయిలయ్య మాట్లాడారు.. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతావనిలో ఐక్యమైన సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సంఘటితమై సాయుధ పోరాటం సాగించారని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశత్వాన్ని ధైర్యంగా ఎదురించి పోరాట స్ఫూర్తిని చాటారని, ఆమె కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అండగా నిలిచారని గుర్తుచేశారు. కడవెండికి చెందిన దొడ్డి కొమురయ్య, నల్లా నర్సింహులు వంటి ఎందరో వీరులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. బైరాన్‌న్‌పల్లి, శిలారాంపూర్‌, కూటిగల్‌, తార్కూరు, ఆకునూర్‌ వంటి గ్రామాల్లోనూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, అనేక మంది అమరులయ్యారని అన్నారు.

సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన

నాటి పోరాటాల స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని బీర్ల అయిలయ్య అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 3 కోట్ల 91 లక్షల 38 వేల 829 మంది మహిళా ప్రయాణికులు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 5,756 ఇళ్లు మంజూరు కాగా, 5,426 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయని తెలిపారు. 2,605 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇప్పటివరకు రూ.157.56 కోట్లు లబ్ధిదారులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఉపాధి, శిక్షణ శాఖ ద్వారా 11 నోటిఫికేషన్లు జారీ చేసి 164 పోస్టుల భర్తీకి 1,47 2 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించడంతో పాటు నియామక ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు.

విద్యలోనూ ముందంజ

పీజీఐ ర్యాంకింగ్‌లో 2024–25, 2025–26లో వరుసగా రెండేళ్లు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థుల్లో గణిత భయాన్ని తొలగించేందుకు ఫాస్ట్‌ మ్యాథ్స్‌ పుస్తకాలు, ఆంగ్ల భాషా నైపుణ్యాల పెంపునకు ఇంగ్లిష్‌ గ్రామర్‌ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు తెలంగాణ సంస్కృతిని చాటి చెబుతూ జానపద గేయాలతో పాటు కూచిపూడి, భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఉత్తమ ప్రతిభకు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, కలెక్టర్‌, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement