జనగామ రూరల్: పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా వైద్యారోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 13న ముందుగా గుర్తించిన సెంటర్ల వద్ద, ఈనెల 20న మాప్– అప్‌డే సందర్భంగా మిగిలిపోయిన పిల్లల కు రెండు విడతల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 1నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇటీవల డీఎంహెచ్‌ఓ ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
మొత్తం 1,14,055 మంది పిల్లలు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్లు, వసతి గృహాలు, నర్సింగ్ కళాశాల, జూనియర్ కళాశాలల్లో మొత్తం 1,14,055 మందికి ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నారు. మొత్తం వేయికి పైగా కేంద్రాలు ఏర్పాట్లు చేసి మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఒక సంవత్సరం నుంచి రెండేళ్లలోపు మాత్రను, రెండు నుంచి మూడేళ్ల లోపు వారికి ఒక మాత్రను క్రష్ చేసి, మూడేళ్ల నుంచి 19ఏళ్ల పిల్లలకు ఒక మాత్రను చప్పరించి నమిలి మింగాలి. జిల్లాలో ఏ ఒక్కరూ మిగిలి పోకుండా అర్హులైన బాలబాలికలపై ప్రత్యేకార్యచరణ ప్రణాళిక రూపోందించారు.
విద్యార్థులకు ఎదుగుదలకు
నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక, మానసిక ఎదుగుదల మందగించడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు కోరుతున్నారు.
మాత్రలు తప్పనిసరిగా
వేసుకోవాలి
1నుంచి 19ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా నులిపురుగుల నివారణకు తప్పని సరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. తల్లిదండ్రులు బాధ్యతగా సమీప సెంటర్‌కు వెళ్లి వేయించాలి. ఆశాలు సంబంధిత కార్యకర్తలను సంప్రదించి తగు సూచనలు తీసుకోవాలి.
–మల్లికార్జున రావు, డీఎంహెచ్‌ఓ
నేటి నుంచి ఆల్బెండజోల్ మాత్రల
పంపిణీ
1 నుంచి 19ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరి
నులిపురుగుల నివారణకు వైద్యారోగ్య శాఖ చర్యలు


