అభివృద్ధిపథం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపథం

May 23 2026 1:58 AM | Updated on May 23 2026 1:58 AM

గిరిజన గ్రామం..

జనగామ: గిరిజన గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌(పీఎం జేఏఎన్‌ఎంఏఎన్‌), ధర్తి అబా గ్రామ ఉత్కర్ష అభియాన్‌ (డీఏజేజీ యూఏ) పథకాల అమలు జిల్లాలో ప్రారంభమైంది. గ్రామాల స్థాయి అవసరాలను గుర్తించి, కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రత్యేక సర్వేతో పాటు వివిధ శాఖలు గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలనలు ప్రారంభించాయి. గ్రామాల్లో అభివృద్ధి శాశ్వత మార్పు తెచ్చే దిశగా ఈ పథకాలు పని చేయనున్నాయి.

గ్రామాల్లో ప్రత్యక్ష పరిశీలన అవసరాల

గణాంకాల సేకరణ

మండలాల వారీగా ఎంపికైన తొమ్మిది గిరిజన గ్రామాల్లో అధికారులు ఇంటింటికీ తిరుగుతూ కుటుంబాల స్థితిగతులను నమోదు చేస్తున్నారు. విద్యుత్‌ కనెక్టివిటీ లోపాలు, తాగునీటి సమస్యలు, రోడ్లస్థితి, ఆరోగ్య సేవల అందుబాటు, అటవీ హక్కుల అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సర్వే బృందాలు గుర్తిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఈ గణాంకాలను నివేదిక రూపంలో కేంద్రానికి పంపించి, ప్రతీ ఊరుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తారు.

ఆరోగ్య రంగంలో కీలక మార్పులు

గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ సికిల్‌సెల్‌ ఎనిమియా వ్యాధి ప్రభావం ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. గర్భిణులకు పోషకాహార పరీక్షలు, చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, పెద్దల్లో సికిల్‌సెల్‌ స్క్రీనింగ్‌పై అవగాహన కల్పించనున్నారు. గ్రామాల్లో తక్కువగా ఉన్న ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపర్చనున్నారు.

విద్య, ఉపాధిలో కొత్త అవకాశాలు

గిరిజన యువతలో డిజిటల్‌ అవగాహన కొరవడిన నేపథ్యంలో పథకాల్లో భాగంగా గ్రామాల్లో డిజిటల్‌ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. పాఠశాలల్లో సదుపాయాల లేమి, హాజరు శాతం తక్కువగా ఉండడంతో విద్యా విభాగం సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది. మహిళా సంఘాలకు నైపుణ్య శిక్షణలు, చిన్న వ్యాపారాలకు సహకారం అందించేందుకు ఐటీడీఏ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది.

అటవీ హక్కులపై..

గిరిజన కుటుంబాలు ఇప్పటికీ అటవీ భూములపై హక్కుల ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ స్కీంలో భాగంగా పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటిస్తారు. భూములపై న్యాయబద్ధ హక్కులు లభిస్తే వ్యవసాయం, పంటలపైనా స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఆరు మండలాలు..తొమ్మిది గ్రామాలు

కేంద్రం ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకాల అమలు కోసం జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో తొమ్మిది గ్రామాలను ఎంపిక చేయగా, వీటి పరిధిలో 17,108 మంది జనాభా ఉన్నారు. తరిగొప్పుల మండలంలోని బొంతగట్టు నాగారం, నర్మెట మండలంలోని బొమ్మకూరు, చిల్పూర్‌ మండలంలోని మల్కపేట, పాలకుర్తి మండలంలోని ఫతేపూర్‌, కొండాపూర్‌, దేవరుప్పుల మండలంలోని మైలారం, మాధవాపురం, కొడకండ్ల మ ండలంలోని ధర్మపురం, మొండ్రాయి గ్రామాలు ఎంపికయ్యాయి. గ్రామాల్లో జరిగిన సర్వే సమయంలో శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. ప్రతీ గ్రామంలో కనీసం ఒక అవగాహన శిబిరం నిర్వహించి, ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల కవరేజ్‌ను నిర్ధారించాలని ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 27వరకు ఈ పథకాలపై ఎంపికై న గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. జిల్లాలోని గిరిజన గ్రామాలు అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతాయని ఆకాంక్షిస్తున్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి గిరిజన కుటుంబాల నిజమైన అవసరాలను గుర్తించడం ఈ సర్వేలో ప్రధాన అంశం. ఆరోగ్య, విద్య, ఉపాధి, భూహక్కుల సమస్యలు, పోషకాహారం లోపాలు, మౌలిక వసతుల సమస్యలు వంటి అంశాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి కేంద్రానికి పంపనున్నారు.

సమన్వయంతో పనిచేయాలి

ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌(పీఎం జేఏఎన్‌ ఎంఏఎన్‌), ధర్తి అబా గ్రామ ఉత్కర్ష అభియాన్‌ (డీఏజేజీ యూఏ) పథకాల అమలు కోసం అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేయాలి. ‘జన్‌ భాగీదారి–సర్వే డోర్‌, సర్వే విలేజ్‌’ ఐఈసీ అవగాహన కార్యక్రమాలపై గిరిజన గ్రామాల్లో విస్త్రృత అవగాహన కల్పించాలి. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు చేకూరేలా అన్ని శాఖలు కృషి చేయాలి. జిల్లాలోని ఆరు మండలాల్లోని తొమ్మది గ్రామాల్లో 19 నుంచి 27 వరకు సర్వే కొనసాగుతుంది.

– సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

అడవి బిడ్డల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం

జీవనోపాధికి ఊతం.. జీవన ప్రమాణాలు మెరుగే లక్ష్యం

రైతు కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం

విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లాలో ఆరు మండలాల పరిధిలో 9 గ్రామాలు ఎంపిక

మండలం గ్రామం గిరిజన జనాభా

(సుమారు)

తరిగొప్పుల బొంతగట్టునాగారం 2,807

నర్మెట బొమ్మకూరు 849

చిల్పూర్‌ మల్కాపూర్‌ 1,167

పాలకుర్తి ఫతేపూర్‌ 1,982

పాలకుర్తి కొండాపూర్‌ 2,139

దేవరుప్పుల మైలారం 774

దేవరుప్పుల మాధవాపురం 3,515

కొడకండ్ల ధర్మాపురం 3,023

కొడకండ్ల మొండ్రాయి 852

మొత్తం 09 17,108

Advertisement
 
Advertisement
Advertisement