జనగామ: అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెనన్స్ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కేవలం పరిపాలనా కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్యానికి ఆచరణాత్మక రూపమని పేర్కొన్నారు. రైతు భరోసా కింద యాసంగిలో 1,85,504 మంది రైతులకు రూ.152.10 కోట్లు జమ చేశామన్నారు. 1,87,002 రేషన్ కార్డుల ద్వారా 5,64,657 మంది 3584.285 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పొందుతున్నారని, కొత్తగా 25,972 కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. పింఛన్ల కింద 74,993 మందికి నెలకు రూ.18.90 కోట్లు అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల మొ దటి విడతలో 5,652 ఇళ్లు మంజూరై 5,339 గ్రౌండింగ్ పూర్తయిందని, రూ.155 కోట్లు జమ చేశామన్నారు. డీసీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు రూ.58.15 కోట్లు, మహిళా సమాఖ్యలకు రూ.61.36 లక్షల చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం కావాలి
కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలను పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని, ఈ ప్రక్రియను త్వరతగతిన పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ, క్రాప్ బుకింగ్, రైతుబీమా తదితర వాటిపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, ఏడీలు, ఎంఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.
ధాన్యం, మొక్కజొన్నను
వెంటనే మిల్లులకు తరలించాలి
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్నలను వెంటనే మిల్లులు, గోదాంలకు తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై పౌరసరఫరాల అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్ష సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్‌డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాల్లో ప్రజలే కేంద్రబిందువు
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక విజయవంతం
జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


