జనగామ రూరల్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా 98.23 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. మొత్తం 183 ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, మైనార్టీ, కస్తూర్బా గాంధీ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతి బాపూలే, బీసీ వెల్ఫేర్, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, గిరిజన పాఠశాలలు ఉండగా ఇందులో మొత్తం 6,443 విద్యార్థులు పరీక్షలు రాయగా 6,292 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 3,013 మంది, బాలికలు 3,279 ఉన్నారు. గత ఏడాది జిల్లా విద్యార్థులు 98.81 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈఏడాది 97.66 ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదికంటే ఒక శాతం ఉత్తీర్ణత తగ్గగా.. బాలికల ఉత్తీర్ణత శాతం గత ఏడాదికంటే కొంత పెరిగింది.
వివిధ పాఠశాలల ఉత్తీర్ణత వివరాలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 183 పాఠశాలలు ఉన్నాయి. ఎయిడెడ్ పాఠశాలలు 88.88 శాతం, ఆశ్రమ పాఠశాలలు 96.03 శాతం, బీసీ వెల్ఫేర్ 99.84 శాతం, ప్రభుత్వ పాఠశాల 92.94 శాతం, కేజీబీవీలు 99.61 శాతం, మోడల్ పాఠశాలలు 98.35 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 99.36 శాతం, రెసిడెన్షియల్ 100శాతం, మైనార్టీ పాఠశాల 100 శాతం, సోషల్ వెల్ఫేర్ 99.26 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ 99.28 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలు, 95.53 శాతం ఉత్తీర్ణత
సాధించాయి.
కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
జిల్లాలోని 12 కేజీబీవీల్లో 8 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 505 మంది విద్యార్థులకుగాను 498 మంది ఉత్తీర్ణత సాధించారు. 99 శాతం ఉత్తీర్ణత ఉండగా 551 మార్కులతో పాలకుర్తి కేజీబీవీ విద్యార్థిని పూర్ణిమ ప్రథమ స్థానంలో నిలిచింది. కొడకండ్ల కేజీబీవీ విద్యార్థిని యశస్విని 548 మార్కులు సాధించింది. 80మంది 500 పైగా మార్కులు సాధించారు.
జెడ్పీ విద్యార్థుల ఉత్తీర్ణత
పట్టణంలోని ధర్మకంచ, మండలంలోని వడ్లకొండ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 1,577 మంది విద్యార్థులకుగాను 1,523 మంది ఉత్తీర్ణత సాధించారు. వడ్లకొండ జెడ్పీ పాఠశాల విద్యార్థిని గోల్లపల్లి ఐశ్వర్య 571 మార్కులు సాధించింది. ధర్మకంచ పాఠశాలకు చెందిన మారబోయిన సంయుక్త 557 మార్కులు, కొయ్యాడ ధనశ్రీ 554 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.
మైనార్టీ బాలుర గురుకులాల్లో..
జనగామ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బి.కేవిన్ 533 మార్కులు, పి.మణికంఠ 525 మార్కులు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
మెరిసిన మహాత్మా జ్యోతి బాపూలే
గురుకుల విద్యార్థులు
మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 6 పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత 4 పాఠశాలలు సాధించగా 397 మంది విద్యార్థులకు 394 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పూజశ్రీ 581 మార్కులు, విఘ్నేశ్ 579 మార్కులు సాధించారు.
సోషల్ వెల్ఫేర్‌లో..
జిల్లాలోని అయిదు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, పాలకుర్తి, జఫర్‌గఢ్ రెండు గురుకులాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నర్మెట పాఠశాలకు చెందిన బిందు 571 మార్కులు, జఫర్‌గఢ్ పాఠశాలకు చెందిన సహస్ర 555 మార్కులు సాధించారు.
గత ఐదేళ్లలో ఉత్తీర్ణత శాతం ఇలా..
సంవత్సరం బాలికలు బాలురు మొత్తం
2021–22 96.01 93.39 94.72.
2022–23 91.17 92.58 91.90
2023–24 98.68 97.59 98.16
2024–25 99.20 98.40 98.81
2025–26 98.23 97.04 97.66
రాష్ట్రస్థాయిలో జిల్లాకు 17వ స్థానం
జిల్లా వ్యాప్తంగా 97.66 శాతం పాస్
గతంకంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం


