కొనుగోళ్లకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లకు సన్నద్ధం

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు తలనొప్పిగా ‘తరుగు’

కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటాం..

2.97లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

జనగామ రూరల్‌: యాసంగి సీజన్‌ 2025–26 ధాన్యం కొనుగోళ్లకు జిల్లా వ్యవసాయ, ఇతర శాఖల అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2.05 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుకాగా సుమారు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో సుమారుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సుమారు 3 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరణ చేపట్టాలని సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కావడంతో ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కలెక్టరేట్‌లో అధికారులతో రెండు సార్లు సమీక్షలు నిర్వహించారు. ఏప్రిల్‌ రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. యాసంగిలో వరి పండించిన ఏరియా దిగుబడి అంచనా మేరకు మొత్తం 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇందులో 105 కేంద్రాల ద్వారా సన్నరకం సేకరించాలని నిర్ణయించారు. వానాకాలం మాదిరిగానే సన్నరకం వడ్లకు ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌ రూ.500లు బోనస్‌ అందజేయనుంది. ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,369, సాధారణ రకం రూ.2,389 రైతులకు మద్దతు ధర లభించనుంది. ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభించగా అడపాదడపా ఆకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ధాన్యం కొనుగోలులో రవాణా ప్రక్రియ సజావుగా నిర్వహించాల్సి ఉంది. గోదాముల కేటాయింపు, వాహనాల కొరత లేకుండా చూడాల్సింది. అలాగే జిల్లాకు 50 లక్షల గన్నీలు అవసరం ఉండగా 30 లక్షలకు పైగా అందుబాటులో ఉండగా మరిన్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ధాన్యం ఎక్కువగా వస్తుందన్న అంచనాతో మిల్లర్ల గోదాములతో పాటు వర్షాలకు పంట దెబ్బతినకుండా అదనపు గోదాములు నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాంతాలను అన్వేషిస్తున్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. గతంలో ఏప్రిల్‌ చివరి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యం కేంద్రాలకు వెల్లువలా వచ్చేది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు సరిపడా స్థలాలు లభ్యం కాకపోవడంతో రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోవడంతో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారేది. గతేడాది కంటే అధికారులు ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే కార్యాచరణ, సన్నాహాలు చేస్తుండటంతో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల నిర్వహణలో తలెత్తిన అనుభవాల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. సెర్ప్‌, మార్కెట్‌, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత యాసంగిలో వర్షాల నేపథ్యంలో బ్యాగుకు 1.2కేజీల తరుగు తీయగా కొనుగోలు చేశాక రైస్‌మిల్లర్లు ఐదు నుంచి ఏడు కేజీల తరుగు తీస్తేనే తీసుకుంటామని మెలిక పెట్టారు.దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.

319 కొనుగోలు కేంద్రాల

ఏర్పాటుకు సిద్ధం

సన్నరకం కొనుగోలు కేంద్రాలు 105

సజావుగా కొనుగోళ్లు నిర్వహించాలని కలెక్టర్‌ అదేశం

కొనుగోలు కేంద్రాలు మొత్తం: 319 దొడ్డు ధాన్యం: 214 సన్నరకం: 105 కొనుగోళ్ల లక్ష్యం: 2.97 లక్షల మెట్రిక్‌ టన్నులు

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తాలు, తరుగు, తేమ, మట్టి పెల్లల శాతం ఎంత ఉండాలనే విషయంలో ముందుగానే శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు ముందుగా తాలు మొత్తం తూర్పార పట్టి తేమ అవసరమైన మోతాదుకు వచ్చే వరకు ఆరబెట్టుకుని తీసుకురావాలి.

– హాతీరామ్‌, డీఎం, సివిల్‌ సప్లై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement