కో ఆప్షన్‌.. కసరత్తు | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌.. కసరత్తు

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

జనగామ: మున్సిపల్‌ శాఖ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా సహ సభ్యుల (కో–ఆప్షన్‌ మెంబర్స్‌) ఎంపికపై మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం కమిషనర్‌, డైరెక్టర్‌ టీకే శ్రీదేవి సర్క్యులర్‌ జారీ చేశారు. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ జరుగనుండగా, ఆశావహులు ఇప్పటినుంచే పదవి కోసం పైరవీలను మొదలుపెట్టారు.

ప్రభుత్వ కీలక నిర్ణయాలు..

2020లో జారీ చేసిన రెండు కీలక జీఓల ప్రకారం ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని సహ సభ్యులుగా తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో ఈ సూచనలను తక్షణం అమలు చేయాలని ఆదేశించారు.

దరఖాస్తు ప్రక్రియ..

తొలి కౌన్సిల్‌ మీటింగ్‌ తేదీ నుంచి 60 రోజుల్లో నోటిఫికేషన్‌న్‌ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించాలి. పత్రాల పరిశీలనతో సహా మొత్తం ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సర్క్యులర్‌లో ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన 15 రోజుల్లో కౌన్సిల్‌ సమావేశం జరపాలి. కౌన్సిల్‌లో ఇద్దరు కో–ఆప్షన్‌ సభ్యులను ఎంపిక చేయగా, ఇందులో ఒక మహిళ ఉండేలా చేసుకోవాలి. కోఆప్షన్‌ ఎన్నిక కోసం సభ్యులు సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్టుగా పరిగణిస్తారు. నిర్ణీత సమయానికి కోరం లేకపోతే సమావేశం వాయిదా వేస్తారు. రెండు, మూడు సమావేశాల్లో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి. రెండూ వాయిదాలు పడితే, మూడో సమావేశంలో కోరం లేకున్నా కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే విధంగా సర్క్యులర్‌ జారీ చేశారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువ, తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువైతే వాయిస్‌ ఓటుతో అవసరమైన సంఖ్యలో ఎంపిక చేయాలి. సరిపడా దరఖాస్తులు రాకపోతే కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసి, పాత దరఖాస్తులతో పాటు కొత్త వాటిని పరిగణలోకి తీసుకోవాలి.

నిబంధనలు ఇలా

రాజీనామాలు, అర్హత కోల్పోవడం వంటి సందర్భాల్లో ఎన్నికైన సభ్యులపై వర్తించే నిబంధనలు అదే విధంగా అమలు చేయాలి. ఖాళీ అయిన స్థానాన్ని మూడు నెలల్లోగా భర్తీ చేయాలి. పదవీకాలం ముగిసే మూడు నెలల్లో ఖాళీ అయితే భర్తీ అవసరం లేదు. ఎన్నికై న కో ఆప్షన్‌ సభ్యుల వివరాలతో కమిషనర్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీటిని కలెక్టర్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌కు పంపిస్తారు. అలాగే మున్సిపాలిటీ నోటిస్‌ బోర్డులో ప్రదర్శిస్తారు. మైనారిటీ కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు ప్రత్యేక నియమాలను (2020) జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తింపు చేసే విధంగా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కో ఆప్షన్‌ కోసం మైనారిటీ వర్గాల్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఉండగా, ఇద్దరు మైనారిటీ సభ్యుల కో–ఆప్షన్‌ ఎంపికలో ఒక మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలి. సర్క్యులర్‌ వచ్చిన తర్వాత 60 రోజుల్లో నోటిఫికేషన్‌, 7 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయమై జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 6వ తేదీన ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు.

ఎంపికకు అవసరమైన అర్హతలు

అభ్యర్థి కనీసం 21 సంవత్సరాల పైబడినవారు అయి ఉండాలి. అదే మున్సిపాలిటీలో ఓటర్‌గా నమోదై ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు చైర్‌పర్సన్‌, మేయర్‌, వార్డు మెంబర్‌గా పనిచేసి ఉండాలి. లేదా 3 సంవత్సరాలు మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేసిన న్యాయవాది అయి ఉండాలి. లేదా ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో గెజిటెడ్‌ ఉద్యోగిగా రిటైర్డ్‌ అయి మున్సిపల్‌ పరిపాలనలో అనుభవం ఉండాలి. ఇందులో ఒక మహిళను తప్పనిసరిగా సహ సభ్యురాలిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

సర్క్యులర్‌ జారీ చేసిన మున్సిపల్‌ శాఖ

అర్హత, అనుభవంపై స్పష్టమైన మార్గదర్శకాలు

60 రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement