జనగామ
ఆర్టీసీ డిపో సమాచారం:
బస్సులు: 125
రోజువారీ రూట్లు: 53
రోజువారీ ప్రయాణికులు: 58వేలు
రోజువారీ కిలో మీటర్లు: 47వేలు
29 నెలల కాలంలో మహిళా
ప్రయాణికుల సంఖ్య: 3.24కోట్లు
జీరో టికెట్ కలెక్షన్లు: రూ.160కోట్లు
అత్యధిక ఆదాయం వచ్చే రూట్లు: 4
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం జిల్లాలో విశేష ఫలితాలను ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం మహిళల రవాణా సమస్యలను గణనీయంగా తగ్గించడమే కాకుండా, వారి ఉద్యోగ, విద్య, ఆరోగ్య, రోజువారీ అవసరాలకు మరింత సౌలభ్యం కల్పించింది. ముఖ్యంగా జనగామ ఆర్టీసీ డిపో పరిధిలో ఈ పథకం ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది.
రూ.3.24 కోట్ల మహిళా ప్రయాణికులు
ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిన 29 నెలల్లో 3.24 కోట్ల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా రు. ఈ ప్రయాణాల ద్వారా ప్రభుత్వం నుంచి ఆ ర్టీసీకి రూ.160 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మహిళల ప్రయాణ భద్రత, సౌలభ్యం పెరగడంతో ప్రయాణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. డిపోలో 125 బస్సులు ఉండగా, 13 డీలక్స్, 32 ఎక్స్‌ప్రెస్, 80 పల్లె వెలుగు బస్సులు ఉన్నా యి. రోజు వారీగా 53 రూట్లలో 47వేల కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నాయి. ఇందులో డిపో మొత్తం కార్యకలాపాల్లో మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి రోజూ ప్రయాణికుల్లో 65శాతం మహిళలు(సుమారు 38వేల మంది), 35 శాతం పురుషులు ఉన్నారు.
అత్యధికంగా కలెక్షన్లు వచ్చే రూట్లు
జనగామ డిపో పరిధిలో అత్యధికంగా నాలుగు రూట్లలో మహిళా ప్రయాణికులు ప్రయాణం సాగిస్తున్నారు. ఉప్పల్–హనుమకొండ, జగద్గిరిగుట్ట, సిద్దిపేట–సూర్యాపేట రూట్లలో బస్సు సర్వీసులు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా ఉండటంతో ఆదాయం కూడా పెరుగుతోంది.
10 వేలకు పైగా..
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేసిన తర్వాత రోజువారీగా 10 వేలకుపైగా మహిళలు అదనంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణంతో మహిళలు ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, ఆసుపత్రులకు, మార్కెట్లకు వెళ్లడంలో భయపడకుండా ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ప్రయాణ రక్షణ ఇవ్వడమే కాకుండా, వారి ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తోంది. దీంతో మహిళల సామాజిక, ఆర్థిక స్థితిలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి.
మహిళా ఉద్యోగులకు వరం
జిల్లాలో పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులు నిత్యం అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. హన్మకొండ, ఉప్పల్, కూకట్‌పల్లి, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉచిత సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన
29 నెలల్లో రూ.3.24 కోట్ల మహిళా ప్రయాణికులు
రూ.160 కోట్లకు పైగా ఆదాయం
రోజువారీగా 10 వేల అదనపు మహిళా ప్రయాణికులు
సేవల విస్తరణపై అధికారుల దృష్టి


