ప్రొటోకాల్‌ రగడ | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ రగడ

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

వేదికపై వైస్‌ చైర్మన్‌కు చోటు

ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల నిరసన

పోడియం వద్ద బైఠాయించి..

చివరకు వాకౌట్‌

జనగామ: మున్సిపల్‌లో నూతన పాలక మండలి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన రెండో సాధారణ బడ్జెట్‌ సమావేశంలో ప్రొటోకాల్‌ వివాదం చెలరేగింది. మంగళవారం చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ అంశంపై నిరసన మొదలైంది. సమావేశ వేదికపై తమ పార్టీకి చెందిన వైస్‌ చైర్మన్‌కు చోటు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి కౌన్సిల్‌ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ వేదికపై కూర్చోవడం పరిపాటి అని, అదే ప్రొటో కాల్‌ను కొనసాగించాలని వారు పట్టుబట్టారు. ఈ విషయంపై కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ ప్రస్తుత నిబంధనల ప్రకారం వైస్‌ చైర్మన్‌ వేదికపై కూర్చునే అధికారం లేదని, అందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. కమిషనర్‌ సమాధానంపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతసేపు సమావేశాన్ని నిలిపివేశారు. పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, కమిషనర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో వారు చివరకు వాకౌట్‌ చేశారు.

అవమానకర చర్య..

ప్రజలు ఎన్నుకున్న వైస్‌ చైర్మన్‌కు వేదికపైన చోటు నిరాకరించడం అవమానకర చర్య అని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, హఫీజ్‌ ఫాతిమా, గోపగోని సుగుణాకర్‌ గౌడ్‌, సేవెల్లి మధుసూదన్‌, గునిగంటి వెన్నెల, మంజుల, సువార్త, మామిడాల రజిత, ఎనగందుల అనూష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్‌ సమావేశం పూర్తయ్యే వరకు పోలీసులు అక్కడే మోహరించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పరిస్థితులు అదుపులోకి రావడంతో సమావేశం తదుపరి కార్యక్రమాలు కొనసాగాయి. మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశం ము ఖ్యమైన రోజే ప్రొటోకాల్‌ వివాదం కేంద్రబిందువుగా మారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement