● అసెంబ్లీ సమావేశాల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: దేశవ్యాప్తంగా పారాక్వాట్ గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పారాక్వాట్ గడ్డి మందు నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తీర్మానం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రైతులు పంటపొలాల్లో కలుపు మొక్కల నివారణకు, పొలం గట్లపై గడ్డి పెరగకుండా ఉండేందుకు పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డిమందును ఎక్కువగా వినియోగిస్తారన్నారు. అనేక రైతు కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో అప్పులబాధతో, కుటుంబ కలహాలతో, ఇతర సమస్యలతో క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు ఎక్కువగా ఈ గడ్డిమందును వాడుతున్నారన్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడంతో బతకాలనే ఆశ ఉన్నప్పటికీ బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ పారాక్వాట్ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈనెల 27న ఎంపీ కడియం కావ్య పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని పార్లమెంట్‌లో లేవనెత్తారన్నారు. గడ్డిమందు నిషేధంపై తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా ఉండాలని పేర్కొన్నారు.
హోటళ్లపై అధికారుల దాడులు
జనగామ: పట్టణంలోని వివిధ హోటల్స్, టీ స్టాల్స్‌పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సివిల్ సప్లయీస్ డీటీలు శ్రీనివాసు, లచ్చు నాయక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో 10 సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేసి, 10 మంది టీస్టాల్స్ యజమానులపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు మినహా, ఇంట్లో ఉపయోగించే సబ్సిడీ సిలిండర్లను వాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు అప్పగించారు.


