జనగామ: జిల్లా వ్యాప్తంగా ఔషధ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న మెడికల్ షాపులపై అధికారుల తనిఖీలు వేగం పెరిగాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా ఔషధ తనిఖీ అధికారి బాలకృష్ణ జిల్లాలోని పలు మండలాల్లో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తుల ద్వారా మత్తు అలవాటు కలిగించే మందుల అమ్మకాలు నిర్వహించగా, నియమాలు ఉల్లంఘించిన మెడికల్ దుకాణాలను సీజ్ చేశారు. అనంతరం సంబంధిత నివేదికలను వరంగల్ ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా మత్తు పదార్థాలు అమ్మకాలు చేసిన ఔషధ వ్యాపారులకు నోటీసులు జారీ చేసి మెడికల్ దుకాణాల డ్రగ్ లైసెన్స్‌లను జనగామ అధికారి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. డ్రగ్ లైసెన్స్ రద్దు చేసిన సస్పెండ్ అయిన మెడికల్ దుకాణాలు ఆక్సిజన్ మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7 రోజులు), సాయితేజ మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7రోజులు), వాసవి మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7రోజులు) ఏ టు జెడ్ మెడికల్ స్టోర్స్, జనగామ(7రోజులు), సుమన మెడికల్ స్టోర్స్, జనగామ(7రోజులు), మారుతి మెడికల్ స్టోర్స్, లింగాలఘణపురం(5 రోజులు), శ్రీ మల్లికార్జున మెడికల్ ఏజెన్సీస్, జనగామ(2రోజులు) సీజ్ చేశారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బాలకృష్ణ హెచ్చరించారు.
30న ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
జనగామ రూరల్: రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 30న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఆహార భద్రత అధికారి సీహెచ్ వినీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెన్యువల్ చేసుకోవాలని కోరారు. ఆహార భద్రత అధికారి: 7306335795.– గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్: 9985820544 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.


