పొట్టకొట్టిన..బండ కొరత! | - | Sakshi
Sakshi News home page

పొట్టకొట్టిన..బండ కొరత!

Mar 25 2026 7:26 AM | Updated on Mar 25 2026 7:26 AM

జనగామ: జిల్లాలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా 13 రోజులుగా నిలిచిపోవడంతో హోటల్‌ రంగం పూర్తిగా కుదేలైపోతోంది. జిల్లాలోని టిఫిన్‌ సెంటర్లు, భోజనశాలలు, బిర్యానీ సెంటర్లు, డాబా, టీకొట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ పాయింట్లు తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్యాస్‌ లేక 10 నుంచి 25 హోటళ్లు పూర్తిగా మూతపడగా, మరో 70 హోటళ్లు సగం పూట మాత్రమే నడుస్తున్నాయి. వందలాది మంది వలస కార్మికుల్లో సగంమేర ఇప్పటికే ఉపాధి కోల్పోయి కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కట్టెల ధరలు క్వింటాల్‌కు రూ.600 నుంచి రూ.800లకు పెరిగి, మరికొన్ని రోజుల్లో రూ.వేయి దాటనున్నాయని హోటల్‌ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో హోటళ్ల ఆధారంగా జీవనం సాగించే వందలాది కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.

450 హోటల్స్‌కు పైగా..

జిల్లాలో సుమారు 450 వరకు టిఫిన్‌ సెంటర్లు, భోజనశాలలు, బిర్యానీ సెంటర్లు, టీషాపులు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, మద్యం సిట్టింగ్‌లతో పాటు ఇతర తినుబండారాల హోటళ్లు ఉన్నాయి. వీటిలో బీహర్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ నిలిపివేతతో వీరి జీవనోపాధి దెబ్బతింది.

ఫుడ్‌ ఐటెంలలో కోత..

సగం పూట నడుస్తున్న హోటళ్లలో దోశ, వడ, ఇడ్లీ, బోండా వంటి నిత్యాహార వంటకాలపై కూడా సగం కోత విధించారు. మిగతా ఐటమ్స్‌ను కొందరు కట్టెల పొయ్యిలతో, మరికొందరు ఇళ్లలో తాత్కాలిక ఏర్పాట్లతో చేసి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ నష్టాలు భారీగానే ఉంటున్నాయని హోటల్‌ యజమానులు చెబుతున్నారు. గ్యాస్‌ కొరత ప్రభావంతో కట్టెల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.600కు లభించే కట్టెలు రూ.800కు అమ్ముతున్నారు. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే క్వింటాల్‌ కట్టెల ధర రూ.1,000 దాటడం ఖాయమని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల తాత్కాలికంగా సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లతో హోటళ్లు నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, పెద్దగా ప్రయోజనం లేకపోతోంది. యుద్ధ ప్రభావంతో హోటళ్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వందలాది కుటుంబాలు ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతున్నాయి. గ్యాస్‌ అందుబాటులోకి రాకపోతే తమ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించి పోతాయని హోటల్‌ యజమానులు వాపోతున్నారు.

కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాలేక సంక్షోభంలో హోటల్‌ రంగం

మూతబడుతున్న టీ, టిఫిన్‌ సెంటర్లు

దోశ, వడ, ఇడ్లీ, బోండా వంటి ఐటెమ్‌లలో సగం కోత

వందలాది కార్మికుల ఉపాధిపై దెబ్బ.. స్వరాష్ట్రాలకు పయనం

కొన్నిచోట్ల కట్టెల పొయ్యితో వంటకాల తయారీ

మూతబడ్డ హోటల్స్‌

కమర్షియల్‌ గ్యాస్‌ సప్లై నిలిచిపోవడంతో జిల్లా కేంద్రంలో 10 నుంచి 25 హోటళ్లు పూర్తిగా మూతపడగా, మరో 70 హోటళ్లు కేవలం సగం పూట మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది కార్మికులతో పాటు స్థానికంగా పనిచేస్తున్న పలువురు ప్రత్యామ్నాయంగా రోజువారీ కూలీ పనులకు వెళ్లే పరిస్థితికి నెలకొంది. హోటల్స్‌ ప్రభావం కిరాణా, ప్లేట్స్‌, ప్లాస్టిక్‌ గ్లాసులు, వాటర్‌ప్లాంట్లు, కూరగాయల వ్యాపారాలపై సైతం దీని ప్రభావం ఎక్కువగానే పడుతోంది.

సగంపూటే నడిపిస్తున్నారు..

పక్క ఫొటోలో కనిపిస్తున్న హోటల్‌ యజమాని పేరు బొబ్బిశెట్టి రాజశేఖర్‌. జనగామ పట్టణం రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఎస్‌ఆర్‌ టిఫిన్‌ సెంటర్‌ నడిపిస్తున్నాడు. నిత్యం తెల్లవారుజాము 6 గంటలకు తెరుచుకుని రాత్రి 11 గంటలకు నడిపేవారు. ఇందులో కుటుంబ సభ్యులతో పాటు ఆరుగురు ఇతర రాష్ట్రాలు, జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు కార్మికులు పనిచేస్తున్నారు. కమర్షియల్‌ సిలిండర్ల కొరత ఏర్పడడంతో సగంపూట హోటల్‌ మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో ముగ్గురు జార్ఖండ్‌కు చెందిన కార్మికులు వెళ్లిపోగా, ఉన్న వారికి సగం వేతనం మాత్రమే ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement