● ప్రపంచ ఉత్తమ విద్యా విధానంపై
అధ్యయనం
జనగామ: పాఠశాల విద్యాశాఖ ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం రూపొందించిన టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రాం (ఉపాధ్యాయుల క్షేత్ర పర్యటన, విద్యా మార్పిడి)కు రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎంపిక కాగా, ఇందులో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తౌటం నిహారిక ఉన్నారు. ఫిన్లాండ్‌లో నిర్వహించనున్న ఈ ప్రత్యేక పర్యటనకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాలను సందర్శించనున్నారు. ఫిన్లాండ్ పర్యటన నేపథ్యంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పాఠశాల విద్యా విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఈ పర్యటన ఉండనుంది.
విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి
జనగామ రూరల్: బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్‌రాజు అధ్యక్షత టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు అందజేశారు. టీపీటీఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, కుర్రముల యాదగిరి, జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాలికను లోబర్చుకున్న యువకుడి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకుని, గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఎస్‌లో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌లోని కంకరబోర్డు ప్రాంతానికి చెందిన ఎండీ మౌలానా అనే యువకుడు స్థానిక ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఓ బాలిక ఫొటో దిగేందుకు స్టూడియోకు రాగా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. ఈ క్రమంలో ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతిగా తేలింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. మౌలానాపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని టౌన్ సీఐ తెలిపారు. టౌన్ ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.


