లింగాలఘణపురం: మండలంలోని గుమ్మడవెల్లిలో శనివారం రాత్రి వీచిన గాలిదుమారం, వడగళ్ల వానతో సుమారు 20 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దడిగ గట్టయ్యకు అనే రైతు తన రెండు ఎకరాలతో పాటు కౌలుకు తీసుకొని మరో పది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో కోత కోసే దశలో ఉన్న వరి మొత్తం అంతా నేలరాలింది. దీంతో తీవ్ర మనోవేదనతో ఉన్న గట్టయ్య భార్య రేణుక ఆదివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించింది. స్పందించిన ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్న రేణుక కూతురు రక్షిత వివా హానికి తనవంతుగా పంట నష్టపరిహారంగా రూ.లక్ష సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏఓను పంపిస్తానని చెప్పారు. కాగా గుమ్మడవెల్లి గ్రామం నుంచి కోమ్మాయిపల్లికి వెళ్లే రోడ్డులో సుమారు 20 ఎకరాల పరిధిలోనే తీవ్రమైన గాలిదుమారంతో వడగళ్ల వాన కురిసి నష్టం జరిగింది.


