నేడు రైతుల ఖాతాల్లో
‘రైతుభరోసా’ డబ్బులు
జనగామ: యాసంగి సీజన్‌ను పూర్తి చేసుకున్న రైతులకు పెట్టుబడి సాయం నేటి (ఆదివారం) నుంచి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి రైతుభరోసా పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని విడుదల చేయనున్నారు.
జిల్లాలో 2 లక్షల మంది రైతులు
జిల్లాలో 2,02,044 మంది రైతులు రైతు భరోసా లబ్ధిదారులుగా నమోదు కాగా, ప్రభుత్వం మొదటి విడతలో ఎకరా చొప్పున మొత్తం 1,98,072 మంది రైతులకు భారీ మొత్తాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం ఒక గుంట నుంచి ఎకరం వరకు సాగు భూములకు పెట్టుబడి సాయాన్ని జమ చేయనుండగా, విడతల వారీగా అర్హత కలిగిన ప్రతీ రైతులకు అందించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది. దీంతో రైతులకు యాసంగి పెట్టుబడిలో కొంత ఆర్థిక వెసులుబాటు దొరకనుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శన, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం కోరారు. నర్మెట్టలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ ఎగ్జిబిషన్, స్టాల్స్‌ను మూడు రోజులుగా జిల్లాలోని ఆయా ప్రాంతాల రైతులు వెళ్లి సందర్శిస్తున్నారన్నారు. నేడు సీఎం సమక్షంలో రైతుభరోసా నిధుల విడుదల చేయనున్న సందర్భంగా జిల్లా నుంచి రైతులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 12 మండలాల నుంచి 39 ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో రైతులు నర్మెట్టకు వెళ్లనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో జిల్లాలోని 1,98,072 మంది రైతులకు ఎకరం వరకు రైతుభరోసా నిధులు జమకానున్నట్లు చెప్పారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో పాటు మహిళా, యువ, అభ్యుదయ రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో 2,02,044 మంది రైతులు
మొత్తం రూ. 242.12 కోట్లు


