నేటినుంచి జీడికల్ జాతర
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఈనెల 4(మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడాదిలో రెండుసార్లు కల్యాణోత్సవం నిర్వహించడం వీరాచల రామచంద్రస్వామి ప్రత్యేకత. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరిగే శ్రీరామనవమితో పాటు కార్తీక మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం జరగడం ఇక్కడి విశేషం. అందుకు తగినట్లుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ఏర్పాట్ల కోసం అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం సీసీ రోడ్లు వేయడమే కాకుండా గుండాల వద్దకు భక్తులు వెళ్లేందుకు ప్రత్యేకంగా మెట్లు ఏర్పాటు చేశారు. సుమారు రూ.35 లక్షలతో జాతరలో భక్తులకు తగిన విధంగా సౌకర్యాల కల్పనకు అభివృద్ధి పనులు చేపట్టారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా..
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లు వేశారు. పరిసరాల పరిశుభ్రత, శాంతిభద్రతలు, తాగునీటి వసతి, వైద్యం, పారిశుధ్యంతో పాటు రోడ్డు సౌకర్యం కల్పించారు. ఆలేరు, జనగామ, మోత్కూరు నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. జాతర స్పెషల్ ఆఫీసరుగా నియమితులైన జనగామ ఆర్డీఓ గోపీరామ్ ఏర్పాట్లపై ప్రతీరోజు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయించారు. 10న జరిగే కల్యాణోత్సవానికి ఇప్పటి నుంచే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి..
10న కల్యాణోత్సవం
							నేటినుంచి జీడికల్ జాతర

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
