పీఎంశ్రీ టీచర్లకు ప్రత్యేక ఐడీకార్డులు
జనగామ: ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ విద్యారంగంలో మరో కొత్త అడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలను పెంచి, డిజిటల్ విద్యకు మరింత ఊతమివ్వడమే లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతోంది. ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలు, స్మార్ట్ క్లాస్‌రూంలు, డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా, పాఠశాలలకు కొత్తరూపు ఇవ్వడానికి కేంద్రం ఇప్పటికే ప్రత్యేక లోగో, ఆకర్షణీయ రంగులతో భవనాలను రూపకల్పన చేస్తోంది. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ సమాన గుర్తింపు, ప్రొఫెషనల్ ఐడెంటిటీ కల్పించే లక్ష్యంతో సాఫ్ట్‌వేర్ ఆధారిత ప్రత్యేక ఐడీ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చింది.
గుర్తింపు కార్డులో సమగ్ర సమాచారం
ఈ గుర్తింపు కార్డుల్లో ఉపాధ్యాయుడి ఫొటో, పేరు, పుట్టిన తేదీ, హోదా, ఉద్యోగంలో చేరిన తేదీ, ఎంప్లాయ్ ఐడీ నెంబర్, ఫోన్ నెంబర్, చిరునామా, బ్లడ్ గ్రూపు వంటి వివరాలు పొందుపరుస్తారు. కార్డులను అత్యుత్తమ పీవీసీ నాణ్యతతో తయారు చేసి ప్రత్యేక రక్షణ కవర్లతో అందించనున్నారు. విద్యా పరిపాలనలో సాంకేతికతను వినియోగించి ప్రతి ఉపాధ్యాయుడి వివరాలను డిజిటల్‌గా భద్రపరచే విధంగా కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందిస్తోంది. జిల్లాలో 15 పీఎం శ్రీ పాఠశాలలు ఉండగా, అందులో పనిచేసే టీచర్లకు త్వరలోనే కొత్త ఐడీకార్డులు అందజేయనున్నారు. ప్రతి కా ర్డుకు సుమారు రూ.75 ఖర్చు చేస్తుండగా, ఇందుకోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
