మేలుకొనేదెప్పుడు?
ప్రతి ఏటా ఇదే పరిస్థితి..
వరదనీటిలో ఇబ్బంది పడుతున్న గిర్నిగడ్డ ప్రజలు
పట్టణంలోని రెడ్డి స్ట్రీట్‌కు వెళ్లే దారిలో వరద
జనగామ: అతి భారీ వర్షాలతో జనగామ పట్టణం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణం గుండా వెళ్లే హైదరాబాద్ ప్రధాన రహదారి, శ్రీనగర్ కాలనీ, బాలాజీ నగర్, సీఎంఆర్ కాలనీ, జ్యోతినగర్, కురుమవాడ, అమ్మబావి ప్రధాన రహదారి, గ్రేయిన్ మార్కెట్ ప్రాంతాలు వరద ముప్పుతో తల్లడిల్లుతున్నాయి. ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండడంతో వాహన రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి.
ఎలా వెళ్లాలో తెలియక..
రెండురోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్‌రోడ్డు, జ్యోతినగర్, బాలాజీనగర్, జీఎంఆర్ కాలనీ, శ్రీనగర్ కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో దారులన్నీ మూసుకుపోయాయి. కాలనీ వాసులు తమ ఇళ్లకు ఎక్కడ నుంచి వెళ్లాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డారు. మోకాళ్ల లోతు నీటిని నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలినడకన వెళ్లాల్సి వచ్చింది.
తాత్కాలిక చర్యలతో ఏటా సమస్య
పునరావృతం
సమగ్ర డ్రెయినేజీ ప్రణాళికతోనే పరిష్కారం
గత మూడు, నాలుగు సంవత్సరాలుగా వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. ఇక్కడ కాలువలు, డ్రైన్లు మూసుకుపోవడం, మురుగునీరు వీధుల్లోకి రావడమన్నా కొత్తేమీ కాదు. శాశ్వత పరిష్కారంపై ఎవరూ దృష్టి సారించడం లేదు. వర్షం వచ్చిపోయిన తర్వాత కాలనీల చుట్టుపక్కల రోజుల తరబడి వరద నీరు నిలిచి ఉండడంతో దోమలు, క్రిమికీటకాలు, పాములు ఇళ్లలోకి చేరిపోతున్నాయి. వర్షం ఆగిన తర్వాత కూడా పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతోంది. వరద ముప్పు నుంచి పట్టణాన్ని రక్షించాలంటే సమగ్ర డ్రెయినేజీ ప్రణాళిక అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
							మేలుకొనేదెప్పుడు?

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
