అన్నదాతలు అధైర్యపడొద్దు
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రఘునాథపల్లి: మోంథా తుపానుతో చేతికొచ్చిన పంటకు తీవ్ర నష్టం జరిగిందని, అన్నదాతలు అధైర్యపడొద్దని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై వరద ప్రవహించిన నేపథ్యంలో గురువారం కల్వర్టులను పరిశీలించారు. వరద ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు ఏంటి.. ? నాలా కన్వర్షన్ ఎలా చేశారని ఆరా తీశారు.అలాగే నిడిగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ఫణికిషోర్ తదితరులు ఉన్నారు.
కొనుగోళ్లకు స్పెషల్ డ్రైవ్
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, భారీ వర్షం నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోల్లు చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, ఆర్డీఓలు, మార్కెటింగ్, డీఆర్‌డీఓ, వ్యవసాయ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితర శాఖలకు చెందిన అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షం వల్ల పూర్తిగా తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్‌లకు తరలించాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు, లారీలు, గోనె సంచులు, కొనుగోళ్ల ప్రక్రియ మానిటరింగ్, సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ 8520991823 నంబరును సంప్రదించవచ్చునని సూచించారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
