ఐక్యతా భావాన్ని బలోపేతం చేయాలి
జనగామ రూరల్: యువతలో ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేయడమే సర్దార్ 150 ఐక్యతా మార్చ్ ప్రచార కార్యక్రమం ముఖ్యఉద్దేశమని మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్ర నిర్వహించనుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ భగవత్ కరడ్ మాట్లాడుతూ.. వల్ల భాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం తరఫున కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వశాఖ మై భారత్ ద్వారా అక్టోబర్ 6వ తేదీన సర్దార్ 150 ఐక్యతా మార్చ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. జిల్లాస్థాయి పాదయాత్రలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఉంటాయన్నారు. జాతీయమార్చ్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని, డీపీఆర్వో బి.పల్లవి, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
